Best High Streets : జిడిపిలోనే కాదు.. హైస్ట్రీట్ ల్లోనూ ఉత్తరాదిని వెనక్కి నెట్టిన దక్షిణాది.. నెక్ట్స్ టార్గెట్ న్యూయార్క్ నే

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్ పేరు సంపాదించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన జాబితాలో బెంగళూరులోని ఎంజీ రోడ్డు, హైదరాబాదులోని సోమాజిగూడ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.

  • Written By: Bhaskar
  • Published On:
Best High Streets : జిడిపిలోనే కాదు.. హైస్ట్రీట్ ల్లోనూ ఉత్తరాదిని వెనక్కి నెట్టిన దక్షిణాది.. నెక్ట్స్ టార్గెట్ న్యూయార్క్ నే

Best High Streets : “సాపాటు ఎటూ లేదు. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్” అని ఆకలి రాజ్యం సినిమాలో కమలహాసన్ పాడుతాడు గుర్తుంది కదా! ఒకప్పుడు అంతగా రద్దీగా లేని రాజధాని వీధులు ఇప్పుడు ఏకంగా జనంతో కలకలలాడుతున్నాయి. అంతటితో ఆగలేదు. ఏకంగా హై స్ట్రీట్ జాబితాలోనే సంపాదించుకున్నాయి. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే వచ్చే పది సంవత్సరాలలో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ వీధులను అధిగమించేంత.. ఈ జాబితాకు సంబంధించి నైట్ ఫ్రాంక్ ఇండియా అనే ఒక సంస్థ బుధవారం ఈ వివరాలు వెల్లడించింది.

రద్దీ రద్దీ..

గత 15 సంవత్సరాలలో భారతదేశంలో పలు కీలక నగరాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందాయి. ఇందులో దక్షిణాది చెందిన బెంగళూరు, హైదరాబాద్ మరింత వేగంగా విస్తరించాయి. హైదరాబాద్ నగరం పేరు గుర్తుకొస్తే ఒకప్పుడు చార్మినార్ జ్ఞప్తిలోకి ఉండేది. కానీ ఇప్పుడు అధునాతన నగరం దానిని మరిపిస్తోంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్ పేరు సంపాదించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన జాబితాలో బెంగళూరులోని ఎంజీ రోడ్డు, హైదరాబాదులోని సోమాజిగూడ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ముంబైలోని లింకింగ్ రోడ్డు, ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్, కోల్కతాలోని పార్క్ స్ట్రీట్ మిగతా మూడు స్థానాల్లో నిలిచాయి.

అద్దె కూడా ఆకాశంలో..

ఇక ఈ ప్రాంతాల్లో అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సోమాజిగూడ లో రిటైల్ విభాగంలో చదరపు అడుగు అద్దె 150 నుంచి 175 రూపాయలు పలుకుతోంది. జూబ్లీహిల్స్ లో 200 నుంచి 225 వరకు, బంజారాహిల్స్ లో 190 నుంచి 230 వరకు, గచ్చిబౌలిలో 120 నుంచి 140 వరకు, అమీర్పేటలో 110 నుంచి 130 వరకు అద్దె పలుకుతోంది. ఇదే కర్ణాటకలోని ఎంజీ రోడ్ లో చదరపు అడుగు 250 నుంచి 270 వరకు పలుకుతోంది.

జన విస్ఫోటనం

అయితే ఈ హై స్ట్రీట్ లు ఇంత రద్దీగా మారడానికి కారణం జనాభా విస్ఫోటనం. నగరాల్లోకి విద్య , ఉపాధి నిమిత్తం యువత వలస వెళ్లడంతో జనాభా సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఫలితంగా రద్దీ అనేది ఏర్పడుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా వెలువరించిన వివరాల ప్రకారం ఈ ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన వ్యాపారాలు అధిక మొత్తంలో ఏర్పాటు కావడంతో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా లభిస్తున్నాయి. వచ్చే కాలంలో నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన జాబితా లోని ప్రాంతాలు న్యూయార్క్ సిటీని కూడా మించి పోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాంతాల్లో ప్రజల సగటు ఆదాయం లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. గతంలో 1,70,000 వరకు ఉండగా ప్రస్తుతం అది రెండు లక్షల 30 వేలకు చేరింది. భవిష్యత్తు కాలంలో అది మూడున్నర లక్షలకు చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నైట్ ఫ్రాంక్ సంస్థ తెలియజేయడం విశేషం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితాలో దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీలో 30% ఆక్రమించాయి. ప్రస్తుతం హై స్ట్రీట్ విభాగాల్లో బెంగళూరు, హైదరాబాద్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దేశ ఆర్థిక రాజధానిగా పేరు గడిచిన ముంబై కూడా హైదరాబాద్ వెనకే నిలవడం ఇక్కడ విశేషం.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube