
Sivateja
Sivateja: వరల్డ్ పాపులర్ మేగజైన్ ఫోర్బ్స్ జాబితాలో మరో తెలుగు‘తేజ’ం చోటు దక్కించుకుంది. అన్నిరంగాల్లో టాప్ టెన్ ప్రముఖులను ప్రచురించే పోర్బ్స్ జాబితాలో ఇప్పటికే పలువురు భారత ప్రముఖులు చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఐదు దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన ఫోర్బ్స్ మేగజైన్ అన్నివిభాగాల్లో ప్రముఖులను, ప్రముఖ వ్యక్తులను గుర్తించడం ఆనవాయితీ. ఏటా సంపన్నులు, సంపన్న మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు వంటి విభాగాల్లో టాప్ టెన్, ట్వంటీ, థర్టీ అంటూ జాబితాలు ప్రకటించడం చేస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా శూల శోధన చేసి ఒక జాబితా రూపొందిస్తుంటుంది. ప్రపంచంలోనే ఉత్తమ ప్రమాణికం గల మేగజైన్ గా గుర్తింపు పొందింది. ఈ మేగజైన్ లో తమ కథనాలు, ఫొటోలు రావాలని ఎంతోమంది కలలు కంటారు. అటువంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు ఏపీకి చెందిన శివతేజ.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజకు ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ లో చోటు దక్కింది. తాజాగా ఫోర్బ్స్ 30 ఏళ్ల లోపు 30 మంది యువ ఎచీవర్స్ జాబితాను విడుదల చేసింది. ప్రపంచంలో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తలను గుర్తించింది. అందులో దీ బెస్ట్ గా నిలిచిన 30 మంది యువకులను ఎంపిక చేసి తన మేగజైన్ లో ప్రచురించింది. అందులో శివతేజ ఒకరు కావడం విశేషం. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శివతేజ అరుదైన అవకాశం దక్కించుకోవడంపై కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాథమిక స్థాయి నుంచి శివతేజ చదువులో ముందంజలో ఉండేవారు. గౌహతి ఐఐటీలో ఈసీఈలో ప్రధాన డిగ్రీ, సీఈసీలో అనుబంధ డిగ్రీపూర్తి చేశాడు. నెదర్లాండ్స్‌లో మాస్ర్టిక్ట్ విశ్వవిద్యాలయంలో క్లినికల్ డేటాసైన్సులో పీహెచ్‌డీ పొందాడు. నిరామయి వైద్యసంబంధిత సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవస్థాపకురాలు డా. గీతా మంజునాధ్ ఆధ్వర్యంలో మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్‌ను ముందుగా తెలుసుకునే సాఫ్ట్‌వేర్‌ను 2017లో కనుగొన్న బృందంలో శివతేజ ప్రధానపాత్ర పోషించాడు. మెడికల్ ఇమేజింగ్ లో ఏడేళ్ల పైబడి అనుభవం ఉంది. ఇప్పటివరకూ 25 అంతర్జాతీయ ప్రచురుణలు, రెండు అధ్యయనాలకు రచించారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఈయన పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్ మేగజైన్ అరుదైన అవకాశం కల్పించింది.