Mohammed Siraj: అతని ప్రతిభ ముందు పేదరికం చిన్నబోయింది. అతని కఠోర శ్రమ ముందు ఓటమి లొంగిపోయింది. తండ్రి ప్రోత్సాహం, అతని ఆత్మవిశ్వాసం అనతికాలంలోనే శిఖరస్థాయికి తీసుకెళ్లింది. విమర్శకులే పొగడ్తల వర్షం కురిపించారు. వికెట్లు తీయడం రాదన్న వారే చపట్లు కొట్టారు. అతని బంతి వేగంతో ప్రత్యర్థుల్లో వణుకుపుట్టించారు. గల్లీ క్రికెటర్ నుంచి ప్రపంచ స్థాయి మేటి క్రికెటర్ గా కీర్తి గడించారు. అతనే యువపేసర్ మహ్మద్ సిరాజ్. గల్లీ క్రికెటర్ గా వెళ్లి ప్రపంచంలోనే మేటి క్రికెటర్ గా కీర్తిని గడించారు.

Mohammed Siraj
హైదరాబాద్ కు చెందిన మహ్మద్ సిరాజ్.. అరుదైన ఘనత సాధించారు. బౌలర్ల ర్యాంకింగ్ లో తొలిసారి మొదటి ర్యాంకును సాధించుకున్నారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన జాబితాలో సిరాజ్ 729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా బైలర్ హేజిల్ వుడ్, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచారు. ఇండియాలో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ లలో అద్భతమైన ప్రతిభ కనబరిచారు.
సిరాజ్ బాల్యం పూలబాట కాదు. పేదరికం వెక్కిరించినా వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో కఠోర శ్రమ చేసాడు. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కఠోర సాధనతో భారత జట్టులో చోటు సంపాదించాడు. కానీ అంతలోనే కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. 2019లో వన్డేల్లోకి అడుగుపెట్టాడు. వన్డేల్లో రెండో మ్యాచ్ ఆడేందుకు మూడేళ్ల ఎదురుచూశాడు. ఆ ఎదురుచూపు ఫలించింది. మూడో మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో పది ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇన్నేళ్ల శ్రమకు ఫలితం దక్కలేదు.

Mohammed Siraj
పరుగులు ఇవ్వడం తప్ప.. వికెట్లు తీయడం రాదని విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా వాటిని లెక్క చేయకుండా కఠోరశ్రమను నమ్ముకున్నాడు. అహరహం శ్రమించి కచ్చితమైన బౌలింగ్ చేయడం పై పట్టుసాధించాడు. మంచి పేసర్ గా మార్కులు సంపాదించాడు. టెస్ట్ క్రికెట్ లో మంచి ప్రదర్శన చేశాడు. దీంతో వన్డే క్రికెట్లో మళ్లీ అవకాశం వచ్చింది. అప్పటి నుంచి తన సత్తా చాటాడు. 20 వన్డేల్లో 38 వికెట్లు పడగొట్టి విమర్శకుల చేత ఔరా అనిపించుకున్నాడు. కపిల్ దేవ్, బుమ్రా తర్వాత అగ్రస్థానం అందుకున్న భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు.
గాయాల కారణంగా బుమ్రా జట్టుకు దూరమవుతున్నాడు. షమీలో నిలకడ లోపించింది. ఈ సమయంలో సిరాజ్ సేవలు భారత జట్టుకు కీలకం కానున్నాయి. భారత బౌలింగ్ బాధ్యత సిరాజ్ భుజాల పై ఉందని చెప్పవచ్చు. సిరాజ్ కఠోర శ్రమే అతడిని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. సిరాజ్ జీవితం ఎంతో మంది యువతకు ఆదర్శం. అతడి మార్గం ఆచరణీయం. కలల కనడమే కాదు.. వాటిని నిజం చేసుకోవాలంటే పట్టుదల, కఠోర శ్రమ అవసరమని చెప్పడానికి సిరాజ్ జీవితమే ఉదాహరణ.