Kandikonda: తెలంగాణ పల్లె పాటకు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం కల్పించిన రచయితలలో కందికొండ యాదగిరి ఒకరు. కందికొండ పాటలకు ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ ఉండేది. స్టార్ డైరెక్టర్స్ సైతం కందికొండ పాటలను అమితంగా ఇష్టపడేవారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు గేయ రచయితగా కందికొండ పనిచేశారు. బతుకమ్మ పాటను బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్లిన రచయితలలో ఆయన కూడా ఒకరు. కానీ ఇప్పుడు కందికొండ క్యాన్సర్ తో పోరాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
దీంతో కందికొండను కాపాడుకుందాం అంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తున్నారు. కందికొండ చికిత్సకు ఆర్థికంగా కావాల్సిన సాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే కోన వెంకట్ వంటి ప్రముఖులు కందికొండకు సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సింగర్ స్మిత… కందికొండకు సాయం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పెరాలసిస్ తో కందికొండ బాధపడు తుంటుండగా… క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో థెరపీ చేయించుకున్నారు. ఆయన స్పైనల్‌కార్డ్ లోని సీ1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు.
ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే చికిత్స కోసం 26 లక్షలు ఖర్చు పెట్టారు కందికొండ. ఇంకా పలువురు ప్రముఖులు కందికొండకు సాయం చేయాలని కోరుతున్నారు. పూరీ జగన్నాథ్ సినిమాలు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి వంటి సినిమాలకు పనిచేశారు. ఒకప్పుడు కందికొండ పాటంటే శ్రోతలు మైమరచిపోయేవారు.. సినిమా కంటే ఆయన పాటలను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కందికొండకు సాయం చేసిన స్మితకు థాంక్స్ చెబుతూ పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.