
MODI
Jamili Elections: ఒకప్పుడు ఎన్నికలంటే అంతంతమాత్రమే హడావుడి ఉండేది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉండేది. కానీ ఇప్పడు పరిస్థితి మారిపోయింది. ఎన్నికలంటే పార్టీలకు, అభ్యర్థులకు తడిసి మోపడవుతోంది. ఇక ప్రభుత్వం గురించి చెప్పాల్సిన పని లేదు. దీనికి తోడు అన్ని వ్యవస్థలు ఎన్నికల క్రతువులో పాల్గొనాల్సి వస్తోంది. ఇక లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించాల్సి రావడం వల్ల అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘాల పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియామవళులను అమలు చేయాల్సి రావడం ప్రభుత్వాలకు కత్తి మీద సామవుతోంది. బీజేపీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోటి నుంచి తరుచూ జమిలీ ఎన్నికల ప్రస్తావన వస్తోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు మార్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. అప్పట్లో చాలా మంది పౌరులు మోదీ మాటకు జై కొట్టింది.
ఈనేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్‌లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జమిలి ఎన్నికలే శ్రేయస్కరమని, దాని వల్ల ఖర్చు తగ్గి ఖజానాకు భారీగా ఆదా అవుతుందని వివరించింది. ఈ మేరకు లోక్‌సభలో ఎదురైన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. అయితే రాజ్యాంగ సవరణ, అన్ని రాజకీయ పార్టీలను ఒకేతాటిపైకి తీసుకురావడం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని వివరించారు. పార్లమెంటరీ కమిటీ ఎన్నికల సంఘం సహా వివిధ భాగస్వాములతో సంప్రదించి జమిలి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిశీలించిందని రిజిజు పేర్కొన్నారు.

MODI
రిజిజు వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించలేదని, ఓటర్లలో మత ఛాందసవాదాన్ని రెచ్చగొట్టి ఇటు రాష్ట్రాల్లో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నాయి. జమిలీ ఎన్నికల విధానంం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ఆరోపిస్తున్నాయి. అయితే పరిపాలనలో స్థిరత్వం కోసం జమిలీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నామని కేంద్రం సమర్థించుకుంటోంది. ఇక దేశంలో 1951-52, 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో జమిలీ ఎన్నికలు జరిగాయి. 1968, 69లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. దీంతో జమిలీ గొలుసు తెగిపోయింది. ఇక అప్పటి నుంచి కేంద్రం జమిలీ ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా నరేంద్రమోదీ హయాంలో మరోసారి జమిలీ ఎన్నికలు నిర్వహించే యోచనలో కేంద్రప్రభుత్వం ఉంది. ఇక దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల సంస్కరణల కోసం నియమించిన లా కమిషన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. దానికి అనుగుణంగానే కేంద్రం అడుగులు ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.