Telangana Politics: ఎమ్మెల్యేలు, మంత్రుల సైలెంట్.. తెలంగాణలో ఏం జరుగుతోంది?
కర్ణాటక ఫలితం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది.. దీనికి తోడు భారత రాష్ట్ర సమితి నుంచి కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ జాబితాలో ఇంకా చాలామంది ఉన్నారు.

Telangana Politics: భారత రాష్ట్ర సమితి అంటేనే అతికి పర్యాయపదం. గుడ్డ కాల్చి మీద వేయడంలో, బురద మీద చల్లడమే వారికి నిత్య కృత్యం. పొరపాటున ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే గాయి గాయి చేయడమే వారికి తెలిసిన రాజకీయం.. అలాంటి భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించింది. గత కొంతకాలంగా ఇదే మౌనముద్రలో ఉంటున్నది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నది. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై వ్యాఖ్యలు చేసినప్పుడు కేవలం హరీష్ రావు, కవిత, కేటీఆర్ వంటి వారు మాత్రమే బయటికి వచ్చారు. మిగతా నియోజకవర్గాల సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రెస్ నోట్లు విడుదల చేశారు తప్ప పెద్దగా ఖండించిన దాఖలాలు కనిపించలేదు. అయితే ఈ కోణాన్ని ప్రధాన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. అసలే ఇవి సోషల్ మీడియా రోజులు కాబట్టి.. లోతుగా అధ్యయనం చేస్తే భారత రాష్ట్ర సమితిలో ఏదో జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
అందుకే సైలెంట్
కర్ణాటక ఫలితం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది.. దీనికి తోడు భారత రాష్ట్ర సమితి నుంచి కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ జాబితాలో ఇంకా చాలామంది ఉన్నారు. ఇక దీనికి తోడు భారతీయ జనతా పార్టీ అంతర్గత కలహాలతో సతమతం అవుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పథకాలు వాస్తవ లబ్ధిదారులకు అందకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఎదురు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రజల్లో వ్యతిరేకత కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి సందర్భాల్లో అధికార పక్షం ప్రజల్లో ఎక్కువగా ఉండాలి. అయితే ఇదే విషయాన్ని పసిగట్టిన కెసిఆర్ ప్రజా ప్రతినిధులను కొద్ది రోజుల వరకు సైలెంట్ గా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది.
దశాబ్ది వేడుకలు కొంపముంచాయా?
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతోందని తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ దశాబ్ది వేడుకలను ఉపయోగించుకున్నారు. ఏకంగా రోజులపాటు వేడుకలకు రూపకల్పన చేశారు. అన్ని శాఖలను ఇందులో భాగస్వాములు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ భారత రాష్ట్ర సమితి నాయకులు అతిగా వ్యవహరించడం, ప్రభుత్వం వేడుకలకు నిధులు మంజూరు చేయకపోవడం, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను ఖర్చు బ రాయించాలని చెప్పడం కొంత తేడా కొట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఒక విధంగా ఉంటే.. భారత రాష్ట్ర సమితి నాయకులు అందుకు విరుద్ధంగా ప్రచారం చేయడం ప్రజల్లో ఏవగింపు కలిగించింది. ఇదే విషయాన్ని ఇంటలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేయడంతో ఆయన అప్రమత్తమై ప్రజాప్రతినిధులను సైలెంట్ గా ఉండాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది చాలదన్నట్టు ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి కీలక విషయాలను లేవనెత్తడంతో అది అంతిమంగా అధికార పార్టీకి మైనస్ పాయింట్ గా అయింది. ఇన్నాళ్లపాటు ఉచిత విద్యుత్ కు సంబంధించి అధికార పార్టీ చెప్పినవన్నీ అబద్ధాలే అని రైతులకు తెలవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ పరిణామాలు మొత్తం దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను మొత్తం సైలెంట్ గా ఉండాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొత్తం టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని, అందుకే కెసిఆర్ తెరవెనుక మంత్రాంగం నడిపించేందుకే ఈ ప్రణాళిక కు రూపకల్పన చేశారని వాదనలూ లేకపోలేదు. అయితే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి నేతల మౌనం తుఫాను ముందట ప్రశాంతత లేక.. తమ వైఫల్యానికి అర్ధాంగికారమా? అనేది త్వరలో తేలనుంది.
