YS Sharmila- PM Modi: వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు ఈ రోజు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఉదయం 11 గంటల సమయంలో ఫోన్ చేసిన ప్రధాని సుమారు 10 నిమిషాల పాటు మాట్లాడారు. పలు కీలకాంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. షర్మిళ పాదయాత్రకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులు, ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీసినట్టు సమాచారం. షర్మిళ నుంచి కీలక సమాచారం రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల షర్మిళను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు వార్తలు వచ్చాయి. గంటల తరబడి రోడ్డుపైనే వాహనంలో ఉండిపోయిన షర్మిళను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో నేరుగా ప్రధాని ఫోన్ చేసి పరామర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు తెలంగాణ పొలిటిక్స్ కు కొత్త సంకేతాలిచ్చినట్టయ్యింది.

YS Sharmila- PM Modi
ఇప్పటికే జగన్ వద్ద ప్రధాని మోదీ షర్మిళ గురించి ఆరా తీసినట్టు వార్తలు వచ్చాయి. జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం నిర్వహించిన సన్నాహాక సమావేశానికి జగన్ హాజరయ్యారు. ప్రధాని పలుకరించే క్రమంలో జగన్ వద్ద షర్మిళ విషయం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మీరెందుకు స్పందించలేదని కూడా ప్రధాని అడిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ జగన్ నుంచి మౌనమే సమధానం వచ్చిందని మీడియాలో కథనాలు సైతం ప్రసారమయ్యాయి. ఈ వార్తలపై ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందించారు. అదంతా ఎల్లో కుల మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. జగన్ తో ప్రధాని మాట్లాడేటప్పుడు మూడో వ్యక్తి లేరని.. అటువంటప్పుడు ఆ విషయాలు బయటపడే చాన్సే లేదని తేల్చేశారు. 2024 ఎన్నికలతో ఎల్లో కుల మీడియా అవుట్ అని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రధాని నేరుగా షర్మిళకు ఫోన్ చేసేసరికి.. జగన్ తో నిజంగా చర్చించారన్న అనుమానాలకు బలం చేకూరినట్టయ్యింది.

YS Sharmila- PM Modi
అయితే తాజా పరిణామాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీలో జరిగిన అత్యున్నత సదస్సుకు సీఎం జగన్, ఇటు విపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. జగన్ వద్ద షర్మిళ ఇష్యూను ప్రకటించి ప్రధాని ఇరకాటంలో పడేశారన్న టాక్ నడుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. అటు జగన్, కేసీఆర్ మంచి స్నేహితులు. అలాగని బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లి కేసీఆర్ తో స్నేహం చేయలేని పరిస్థితి జగన్ ది. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతలా చీలితే అంత తనకు వర్కవుట్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిళ బలపడాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే షర్మిళకు హైప్ పెంచాలన్న ఉద్దేశ్యంతో ఆమెను అరెస్ట్ చేశారన్న ప్రచారమూ ఉంది. ఇవన్నీ గుర్తెరిగే ప్రధాని అటు జగన్ ను, ఇటు కేసీఆర్ ను దెబ్బకొట్టేందుకే నేరుగా షర్మిళకు ఫోన్ చేసి ఓదార్చారన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో నడుస్తోంది.