Somu Veerraju: ఏపీ బీజేపీలో సస్సెన్స్ వీడింది. గత కొద్దిరోజులుగా ఊహాగానాలకు తెరదించుతూ.. తెర వెనుక ప్రయత్నాలకు పార్టీ హైకమాండ్ చెక్ చెప్పింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజే కొనసాగుతారని స్పష్టం చేసింది. ఎన్నికల వరకూ ఆయనే ఉంటారని.. ఆయన సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నామని కూడా క్లీయర్ కట్ గా చెప్పేసింది. దీంతో ఇది పార్టీలో వీర్రాజు వ్యతిరేక వర్గాలకు షాక్ నిచ్చిటనట్టయ్యింది. అటు వీర్రాజు దూకుడు నచ్చని ఇతర రాజకీయ పక్షాలకు సైతం ఇది మింగుడు పడడం లేదు. గత కొద్దిరోజులుగా సోము వీర్రాజు నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నించిన వారికి హైకమాండ్ గట్టి సంకేతాలే పంపడడం చర్చనీయాంశంగా మారింది.

Somu Veerraju
బీజేపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ హైకమాండ్ సోము వీర్రాజుకు అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టింది. గత ఎన్నికలకు ముందు మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన సారధ్యంలోనే గత ఎన్నికలను పార్టీ ఫేస్ చేసింది. కానీ దారుణ ఓటమి పాలైంది. అప్పటివరకూ స్నేహితుడిగా ఉన్న చంద్రబాబు దూరం కావడం, విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీని బీజేపీ నమ్మించి మోసం చేసిందని ప్రచారం చేయడం తదితర కారణాలతో బీజేపీ దెబ్బతింది. అయితే అదే సమయంలో చంద్రబాబు కూడా దారుణ ఓటమి చవిచూడడం జరిగిపోయింది. బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కన్నా లక్ష్మీనారాయణ తప్పుకున్నారు అనేదానికంటే.. పార్టీ హైకమాండే ఆయన్ను తప్పించింది. సీనియర్ అయిన సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతానికి బీజేపీలో మూడు వర్గాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం ఉంది. ఒకటి తెలుగుదేశం పార్టీకి అనుకూల వర్గం, రెండూ వైసీపీకి అనుకూలవర్గం, మూడు పాతతరం బీజేపీ నాయకులు వర్గం. ఇలా మూడు వర్గాలను సమన్వయం చేసుకోవడం సోము వీర్రాజుకు కత్తిమీద సాముగా మారింది. అయినా సరే కింద మీద పడి సోము వీర్రాజు పార్టీ ఉనికిని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు అండ్ కోకు వీర్రాజు అడ్డంకిగా మారిపోయారు. దీంతో ఆయనపై వైసీపీ అనుకూలం అని ముద్రవేసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి దూరం చేయాలని ఓ వర్గం చేయని ప్రయత్నం లేదు. ఎన్నికల అనంతరం బీజేపీలో బలవంతంగా చేరిన చంద్రబాబు అనుకూలవర్గం సోము వీర్రాజును తప్పించే ప్రయత్నంలో మునిగి తేలింది. కానీ హైకమాండ్ మాత్రం ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. సోము వీర్రాజుకే అండగా నిలిచి.. గో హెడ్ అని సంకేతాలిచ్చింది.

Somu Veerraju
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భీమవరంలో జరిగింది. పలు రాజకీయ తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీలకు సమదూరం పాటించాలని తీర్మానించారు. అదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కు నివేదించడానికి నిర్ణయించారు. అయితే సమావేశానికి హాజరైన రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహాయ ఇన్ చార్జి సునీల్ దేవదర్ మాత్రం స్పష్టమైన ప్రకటన ఒకటి చేశారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నుంచి రాష్ట్రాల అధ్యక్షుల వరకూ అంతా వచ్చే ఎన్నికల వరకూ కొనసాగుతారని ఆ ప్రకటన సారాంశం. దీంతో గత కొద్దిరోజులుగా ఇంటా బయటా రేగుతున్న ఊహాగానాలకు చెక్ చెప్పినట్టయ్యంది. ముఖ్యంగా బీజేపీతో కలిసి నడవాలని ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు అండ్ కోకు ఇది ఎదురుదెబ్బనన్న విశ్లేషణలు మొదలయ్యాయి.