Pawankalayn : టీడీపీకి షాక్.. ఎన్డీఏ భేటీకి పవన్
ఇటువంటి సమయంలో ఎన్డీఏ కీలక భేటీకి చంద్రబాబుకు ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కేవలం జనసేనతో కలిసి వెళతామని సంకేతాలు ఇస్తే.. అప్పుడు పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ.

Pawankalayn : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. ఎన్డీఏ సమావేశానికి జనసేనకు ఆహ్వానం అందింది. ప్రత్యేక ఆహ్వానం పంపినట్టు సమాచారం. గతంలో ఎన్డీఏలో పనిచేసిన పార్టీలు, భావసారుప్యత కలిగిన పార్టీలకు ఎన్డీఏ భేటీకి బీజేపీ ఆహ్వానాలు పంపుతోంది. అందులో భాగంగా జనసేనకు ఆహ్వానించింది. అయితే ఒకప్పటి మిత్రుడు టీడీపీకి ఇంతవరకూ ఆహ్వానం అందకపోవడం విశేషం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ టీడీపీకి ఆహ్వానం అందకుంటే పరిస్థితి ఎటుదారితీస్తుందన్న చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని వ్యతిరేక కూటమి సమావేశం బెంగళూరులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయంతో దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలిసి పనిచేసేందుకు 18 పార్టీలు ముందుకొచ్చాయి. దీంతో అధికార బీజేపీ కలవరపాటుకు గురైంది. అందుకే ఎన్డీఏ బలోపేతం పై ఫోకస్ పెట్టింది. వివిధ కారణాలతో దూరమైన పార్టీలను దగ్గర చేర్చుకోవాలని భావిస్తోంది. అందుకే ఈ నెల 18న ఎన్డీఏ మిత్రపక్షాల భేటీని ఏర్పాటుచేస్తోంది. దేశ వ్యాప్తంగా భావసారుప్యత కలిగిన పార్టీలకు సైతం ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే జనసేనకు ఆహ్వానించింది.
జాతీయ స్థాయిలో టీఎంసీ, అన్నాడీఎంకే, శివసేన, ఎన్సీపీ చీలికవర్గాలు, అకాలీదళ్, ఎల్జేడీ వంటి పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది.అయితే తెలుగుదేశం పార్టీకి ఇంతవరకూ ఆహ్వానించలేదని తెలుస్తోంది. సమావేశానికి సమయం ఉన్నందున తప్పకుండా ఆహ్వానం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఏపీ విషయానికి వచ్చేసరికి పవన్ కే పరిమితం చేస్తారా? లేకుంటే చంద్రబాబును పిలుస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ కీలక భేటీకి పవన్ తో పాటు పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ వెళ్లే అవకాశముంది.
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలన్నది చంద్రబాబు, పవన్ వ్యూహం. తొలుత బీజేపీ నుంచి అంతగా సానుకూలత రాలేదు. కానీ జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పక్షాలు ఏకమవుతున్న తరుణంలో కాషాయదళంలో మార్పు వచ్చింది. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వ్యక్తమవుతున్నతరుణంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా మౌనం పాటించారు. ఇటువంటి సమయంలో ఎన్డీఏ కీలక భేటీకి చంద్రబాబుకు ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కేవలం జనసేనతో కలిసి వెళతామని సంకేతాలు ఇస్తే.. అప్పుడు పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ.
