MP Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డికి షాక్.. ముందస్తు బెయిల్ కు సుప్రీం నో..
ఈ నేపథ్యంలో అవినాష్ రేపు మళ్లీ సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అయితే అదునుగా సీబీఐ అవినాష్ ను అరెస్టు చేస్తుందా? లేకుంటే మునపటిలా మినహాయింపు ఇస్తుందా అన్నది మరికొద్ది గంట్లో తేలిపోనుంది.

MP Avinash Reddy : వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. దీంతో అవినాష్ రెడ్డిని ఏ క్షణంలోనైనా సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. సీబీఐ అరెస్టు నుంచి బయటపడేందుకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో తన తల్లి శ్రీలక్ష్మి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత తనపై వుందని, విచారణకు హాజరయ్యేందుకు కొన్నిరోజుల సమయం కావాలని కోరారు. అటు సీబీఐ ఏఎస్పీకి లేఖ రాయడంతో పాటు సుప్రీం కోర్టుకు వెళ్లారు.
గత కొంతకాలంగా అవినాష్ అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ అవినాష్ ను సీబీఐ ఆరుసార్లు విచారించింది. ఈ నెల 16న విచారణకు సీబీఐ పిలిచింది. నోటీసులు కూడా ఇచ్చింది.అయితే తనకు ముందస్తు షెడ్యూల్ కార్యక్రమాలు ఫిక్స్ అయినందున.. నాలుగు రోజులు గడువు కావాలని సీబీఐకు అవినాష్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో 19న మరోసారి హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చింది. అయితే పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లిన అవినాష్ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేనని లేఖ రాసి వెళ్లిపోయారు. దీంతో సీబీఐ అధికారులు ఆయన్ను వెంటాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో ఉన్న ఆయనకు సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది. సోమవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. ఇప్పుడు మళ్లీ పదిరోజుల పాటు వాయిదా కావాలని కోరడంతో నేరుగా ఏపీ పోలీసుల సాయంతో సీబీఐ అధికారులు కర్నూలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
తన తల్లి అనారోగ్యంపై వైద్యులు వెల్లడించిన బులెటిన్ ఆధారంగా చేసుకొని అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టు తలుపును తట్టారు. గతంలో హైకోర్టు వేకేషన్ బెంచ్‌ను తన బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో అవినాశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ తేదీని సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు. జూన్ రెండోవారంలో విచారణకు అనుమతిస్తామని చెప్పిన సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం వెల్లడించింది.అత్యవసరం అయితే విచారణ చేపట్టే నిబంధన ఉంది. దీంతో తన తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపి అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ మిశ్రమ స్పందన లభించింది.
అయితే ఈ కేసులో నిబంధనలు పాటించాల్సి ఉంది. మెన్షనింగ్ లిస్ట్‌లో ఉంటేనే విచారిస్తామని జడ్జిలు సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ ధర్మాసనం వెల్లడించింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని న్యాయమూర్తి అనిరుథ్ బోస్ ధర్మాసనం సూచించింది. న్యాయమూర్తి సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు విచారణకు వేయవద్దని మెన్షనింగ్ ఆఫీసర్‌కి ధర్మాసనం సూచించింది. ఈ నేపథ్యంలో అవినాష్ రేపు మళ్లీ సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అయితే అదునుగా సీబీఐ అవినాష్ ను అరెస్టు చేస్తుందా? లేకుంటే మునపటిలా మినహాయింపు ఇస్తుందా అన్నది మరికొద్ది గంట్లో తేలిపోనుంది.