Minister Appalaraju: మంత్రి అప్పలరాజుకు షాక్.. నో ఎంట్రీ బోర్డుతో కలకలకం
ఈ పరిణామంతో అక్కడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఇదేమండలానికి చెందిన గిరిజన ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు మూకుమ్మడిగా పదవులకు రాజీనామా చేశారు.

Minister Appalaraju: వైసీపీ సర్కారుకు అన్నివర్గాల నుంచి నిరసన సెగ తగులుతోంది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చుక్కెదురవుతోంది. ప్రజల ముంగిటకు వెళుతున్న వారికి నిలదీతలు, ప్రశ్నలు తప్పడం లేదు. తమ గడపకు రావొద్దని జనం ముఖం మీదే తలుపులు వేస్తున్నారు. మా ఊరు రావొద్దంటూ ఏకంగా బోర్డులు పెట్టేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం చీపి పంచాయతీలో వెలుగుచూసింది. మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు వైసీపీ నాయకులెవరూ తమ గ్రామంలోకి రావడానికి వీలు లేదంటూ ఊరి పొలిమేరల్లో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం కలకలం సృష్టించింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శాసనసభలో తీర్మానం..
బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు వైసీపీ సర్కారు శాసనసభలో తీర్మానం చేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు భగ్గుమన్నారు. రాయలసీమలో ఉన్న బోయవాల్మీకులను రాజకీయంగా తమ వైపు తిప్పుకునేందుకు జగన్ కొత్త పన్నాగం పన్నారు. ఇప్పటికే ఎస్టీలు తమ వైపు ఉన్నారన్న ధీమాతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు బెల్లుబికాయి. ఆదివాసీలు రహదారులపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. దీంతో ఆదివాసీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
చేజేతులా దూరం చేసుకొని..
గత ఎన్నికల్లో దాదాపు ఎస్టీ నియోజకవర్గాలన్నింటినీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ ఆవిర్భావం నుంచే ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్టీలు వైసీపీ వైపు మళ్లారు. కానీ జగన్ మాత్రం చేజేతులా వారిని దూరం చేసుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముందని వైసీపీలోని ఎస్టీ ప్రజాప్రతినిధులు,నేతలుఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో జగన్ సర్కారు మొండిగా ముందుకెళ్లేందుకే డిసైడయినట్టు ఉంది. దీంతో ఎస్టీ నియోజకవర్గాల్లో గట్టెక్కడం కష్టమేనని నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించకపోతే మాత్రం ఆదివాసీలు నమ్మే స్థితిలో లేరని చెబుతున్నారు.
పదవులకు సైతం రాజీనామా..
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. స్వచ్ఛందంగా పదవులు వదులుకుంటున్నారు. అటు మా నమ్మకం నువ్వే జగన్ పేరిట స్టిక్కర్లు అతికించే కార్యక్రమానికి సైతం ఎక్కడికక్కడే చుక్కెదురవుతోంది. నిలదీతల భయంతో అటువైపుగా ప్రజాప్రతినిధులు, నాయకులు చూడడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని తన సొంత నియోజకవర్గంలో చీపి అనే గిరిజన గ్రామానికి వెళుతుండగా మంత్రి అప్పలరాజుకు గిరిజనులు షాకిచ్చారు. గ్రామానికి రావొద్దంటూ గ్రామ పొలిమేరల్లోనే ఫ్లెక్సీ ఏర్పాటుచేయడంతో మంత్రితోపాటు వైసీపీ నేతలు సైతం షాక్ కు గురయ్యారు. ఈ పరిణామంతో అక్కడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఇదేమండలానికి చెందిన గిరిజన ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు మూకుమ్మడిగా పదవులకు రాజీనామా చేశారు.
