YS Sharmila : ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిళ ఎంట్రీ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్

ప్రజా వ్యతిరేకతకు తోడు వైసీపీ అనుకూల ఓటు కాంగ్రెస్ లోకి వెళితే అది అంతిమంగా టీడీపీ, జనసేనలకు లాభిస్తుందని చంద్రబాబు లెక్కలు కడుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పెద్దలు ద్వారా షర్మిళనకు ఆకర్షించే పనిలో ఉన్నారు

  • Written By: Dharma Raj
  • Published On:
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిళ ఎంట్రీ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్

YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ బలపడాలి.. వైసీపీ ఓటు బ్యాంకు కన్వర్టు కావాలి. చంద్రబాబు అండ్ కో ఇదే టాస్క్ తో పనిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కర్నాటక ఎన్నికల తరువాత ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ సంకేతాలు వేరేలా ఉండడంతో చంద్రబాబు సైతం రూటు మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళను తీసుకొచ్చి కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న యోచన చంద్రబాబు చేసినట్టు తెలుస్తోంది. అటు తెలంగాణలో వైఎస్సార్ టీపీకి ఆశించిన మైలేజీ రాకపోవడంతో షర్మిళ సైతం పునరాలోచనలో పడినట్టు సమాచారం. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ శరవేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన తీసుకొస్తానని షర్మిళ తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నా అనుకూల వాతవరణం ఏర్పడడం లేదు.  తెలంగాణలోని ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న రాజకీయాన్ని అక్కడి ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. ఎంత బలంగా ప్రయత్నిస్తున్నా తెలంగాణ రాజకీయాల్లో ఆమెకు స్పేస్ దొరకడం లేదు. దీంతో వచ్చే ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించాలంటే పొత్తులు తప్పవని ఆమె ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందుకు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అటు కర్నాటక ఫలితాలతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణలో అదే పంథాను కొనసాగించాలని చూస్తోంది. వీలైనంతవరకూ మిగతా పార్టీలను కలుపుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా షర్మిళతో సైతం చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.

మొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీపై ప్రతికూల అభిప్రాయంతో షర్మిళ ఉండేవారు. కానీ కర్నాటక ఫలితాలతో మార్పు వచ్చింది.కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు వచ్చిన తరువాత ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను అభినందించారు. దీంతో తన వ్యూహం మార్చినట్టు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికే ఆమె డీకేకు కలిసినట్టు విశ్లేషణలు వెలువడ్డాయి. తన సోదరిని ఇన్నిరకాలుగా ఇబ్బందిపెడుతున్న కేసీఆర్ సర్కారుకు జగన్ కనీస హెచ్చరికలు పంపలేదు. కనీసం ఆమెను పరామర్శించిన పాపాన పోలేదు. కేసీఆర్, జగన్ లోపయికారీ రాజకీయాలపై ఆగ్రహంగా ఉన్న షర్మిళ సైతం కాంగ్రెస్ అయితే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

ఒక వేళ పొత్తులు కుదర్చుకున్నాక.. సానుకూల ఫలితాలు వస్తే కాంగ్రెస్ లో తన పార్టీ విలీనానికి సైతం షర్మిళ మొగ్గుచూపే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. దానికి వెనుక ఏపీలో వ్యూహం దాగి ఉందన్న టాక్ నడుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవానికి రావాలంటే బలమైననాయకత్వం అవసరం. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా రంగంలోకి దిగితే షర్మిళ ఇట్టే రాణించగలరన్న ధీమా సైతం కాంగ్రెస్ హైకమాండ్ లో ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ ఎదిగేందుకు చంద్రబాబు సాయం కూడా ఉంటుంది. ఒక వేళ ఏపీలో కాంగ్రెస్ బలపడితే అది వైసీపీకే మైనస్. ప్రజా వ్యతిరేకతకు తోడు వైసీపీ అనుకూల ఓటు కాంగ్రెస్ లోకి వెళితే అది అంతిమంగా టీడీపీ, జనసేనలకు లాభిస్తుందని చంద్రబాబు లెక్కలు కడుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పెద్దలు ద్వారా షర్మిళనకు ఆకర్షించే పనిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు