Sharmila -TRS: ఇన్నాళ్లూ వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్.షర్మిలను లైట్ తీసుకున్న టీఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరినీ వదలకుండా చేస్తున్న ఆరోపణలతో హడలిపోతున్నారు. నేతల అవినీటి గుట్టును రట్టు చేస్తుండడంతో వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో గత సోమవారం టీఆర్‌ఎస్ నేతలు పెద్ద రచ్చ చేశారు. వైఎస్సార్‌టీపీ అధినేత్రి వాహనాలకు నిప్పు పెట్టారు, ధ్వంసం చేశారు. మంగళవారం షర్మిల వాటిని తీసుకుని ప్రగతిభవన్‌వైపు వెళ్లడం, ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు చూసిన ప్రజలు టీఆర్‌ఎస్ సర్కార్‌ను, పోలీసులను తప్పుపడుతున్నారు. దీంతో షర్మిలపైనే సానుభూతి వస్తోంది.

Sharmila
తెలంగాణ సెంటిమెంట్ రగిలించే పనిలో..
వాహనాల ధ్వంసం, దాడి, అరెస్ట్ వర్కవుట్ కాకపోవడంతో గులాబీ నేతలు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వైయస్. రాజశేఖరరెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల, వైఎస్సార్ పాలన తీసుకువస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పాదయాత్ర చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రానికి వైఎస్సార్ తీరని ద్రోహం చేశారంటూ ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలకు షర్మిల ఎలా సమాధానం చెప్తారనేది ఉత్కంఠగా మారింది.
తెలంగాణకు అడ్డుపడింది వైఎస్సారే..
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడింది వైఎస్సారే అని ఆరోపించారు. తెలంగాణ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తా అని కాంగ్రెస్ అధినేతలను బెదిరించారని, బ్లాక్ మెయిల్ చేశారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కారణంగా నాడు తెలంగాణ రాష్ట్రంలో వందల సంఖ్యలో విద్యార్థులు అమరులు అయ్యారని మరోమారు సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందించారని షర్మిల చెబుతుంటే, రాజశేఖరరెడ్డి తెలంగాణ ద్రోహి అన్న తీరుగా వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారులు, విద్యార్థులు పోరాటం చేస్తుంటే, వైఎస్సార్ తెలంగాణ విషయంపై అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బ్లాక్ మెయిల్ చేశారని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఇస్తామని కాలయాపన చేస్తూ, మాట దాట వేశారని తెలిపారు.
వైఎస్సార్ కారణంగానే ఆత్మహత్యలు..
తెలంగాణ ప్రకటన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వైఎస్సార్ ఒత్తిడితోనే జాప్యం చేసిందని, దీంతో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. మొత్తంగా తెలంగాణకు వైఎస్సార్‌ను విలన్‌గా చిత్రీకరించేలా ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇదంతా షర్మిల పార్టీని టార్గెట్ చేస్తూనే చేసిన ఆరోపణలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Sharmila
బాల్కసుమన్ వార్నింగ్..
వైఎస్.షర్మిలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణపై షర్మిల విషం కక్కుతోందని మండిపడ్డారు. సంస్కార హీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా షర్మిల మాట్లాడితే టీఆర్‌ఎస్ బాధ్యత వహించదని తెలిపారు. అడ్డగోలుగా మాట్లాడే భాషే ఇందుకు కారణం అని పేర్కొన్నారు. సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నా ఏం మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. ఎవరిని పడితే వారిని.. ఏది పడితే అది మాట్లాడితే ఎలా అన్నారు. ‘ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నల్లి లాగా నలిపేస్తాం’ అని హెచ్చరించారు. ‘‘మేము అనుకుంటే షర్మిల ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదు’’ అని వార్నింగ్ ఇచ్చారు. సర్పంచ్ గా కూడా గెలవని షర్మిల బతుకెంతా? అంటూ ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్, షర్మిల తెలంగాణను వ్యతిరేకించిన వీడియోలను మీడియాకు చూపించారు. పరాయి మనుషులు కిరాయి మనుషులతో తెలంగాణలో చేస్తున్న తోలుబొమ్మలాటను పెద్దగా పట్టించుకోవాల్సిన అవససరం లేదని తెలిపారు. అడ్డగోలుగా షర్మిల మాట్లాడుతున్న తీరును కూడా ప్రజలు గమనించాలన్నారు.