
India vs Australia
India vs Australia: టెస్టు క్రికెట్లో విశ్వ విజేతగా నిలవాలని భారత్, ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందుకోసం రెండు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఈ సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది. అయినా టీమిండియా గెలుపుపై ఎక్కడో మూలన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సమస్యలు భారత్ గెలుపుకు ఆటంకంగా మారే అవకాశాలు ఉన్నాయి. వీటిని అధిగమించకపోతే సిరీస్ గెలవడం అంత ఈజీ కాదని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
కీలక ఆటగాళ్ల ఫామ్
టీమిండియాలో కీలక ఆటగాళ్లు ఫామ్ లేక సతమతమవుతున్నారు. ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. చాలా కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించినా ఫామ్ సాధించడం కష్టంగా కనిపిస్తోంది. కేఎల్.రాహుల్, విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌లో లేరు. రోహిత్ శర్మ కూడా చాలా కాలంగా టెస్టులు ఆడలేదు. దీంతో వీళ్లందరూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కోహ్లీపైనే భారం
టీమిండియా మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ తొలి రెండు మ్యాచులు ఆడటం అనుమానంగా మారింది. వెన్నునొప్పితో బాధ పడుతున్న అయ్యర్ మ్యాచ్‌లు ఆడటంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ అతను జట్టుకు దూరమైతే.. టెస్టుల్లో ఫామ్ అందుకోని కోహ్లీపై మరింత భారం పడుతుంది. మూడేళ్లపైగా టెస్టుల్లో సరైన ఫామ్‌లో లేని కోహ్లీ.. ఈ సిరీస్‌లో భారత జట్టుకు చాలా కీలకంగా మారనున్నాడు. అతను ఫామ్ అందుకుంటే ఓకే కానీ.. లేదంటే మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉంటుంది.

India vs Australia
పంత్ లేని లోటు
టెస్టుల్లో టీమిండియా విజయాల్లో యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ చాలా కీలకమైన పాత్ర పోషించేవాడు. అయితే యాక్సిడెంట్ కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. దీంతో మిడిలార్డర్‌లో కీలకమైన డ్యాషింగ్ బ్యాటర్ లేని లోటు భారత జట్టుపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. అలాగే పంత్ అంత అద్భుతంగా వికెట్ కీపింగ్ చేసే ఆటగాళ్లు కూడా లేరు. కేఎస్.భరత్, ఇషాన్ కిషన్ ఇద్దరూ మంచి ఆటగాళ్లే.. కానీ, ఇప్పటి వరకు ఇద్దరూ అరంగేట్రం చేయలేదు. ఇద్దరికీ అంతర్జాతీయ మ్యాచ్ అనుభవం లేదు. దీనిని ఆస్ట్రేలియా జట్టు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలు కచ్చితంగా భారత విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. చాంపియన్‌గా నిలవాలంటే వీటిని అధిగమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్లు ఫామ్‌లోకి రావాలని సూచిస్తున్నారు.