Fever Survey In Telangana: తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ కేసీఆర్ సర్కార్ ఫీవర్ సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో మాదిరిగానే ఇంటింటికీ హెల్త్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కలిసి టీములుగా వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏ ఇంట్లో చూసినా జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు కూడా చాలామందే సర్వేలో తేలుతున్నారు.

Fever Survey In Telangana
ఇప్పటి దాకా దాదాపు 29.26 లక్షల ఇండ్లలో సర్వే నిర్వహించగా.. 1,28,079మందికి జ్వరం లక్షణాలు తీవ్రంగా ఉన్నాయి. కాగా ఇందులో 1,27,372 మందికి కిట్‌లు పంచారు. వీరందరినీ హోం ఐసోలేషన్ అవ్వాలని కూడా ఆర్డర్లు వేశారు. అయితే ఇలా లక్షణాలు ఉన్న వారంతా కూడా టెస్టులు చేయించుకోకుండా వారి దగ్గరలో ఉన్న డాక్టర్ల వద్ద ట్యాబ్లెట్లు వాడుతున్నారు. ఇక కరోనా వచ్చిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత లక్షణాలు కూడా తగ్గిపోవడంతో అందరూ కరోనాను లైట్ తీసుకుంటున్నారు.
అయితే ఈ సర్వే టీమ్ లలో ఆశా వర్కర్, ఏఎన్ ఎం, మున్సిపల్ సిబ్బంది, గ్రామాల్లో అయితే పంచాయతీ సిబ్బంది కలిసి పని చేస్తున్నారు. ఒక్కో టీమ్ రెండు రోజుల్లో దాదాపు 100 ఇండ్లను సర్వే చేస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నా కూడా ఎవరూ పెద్దగా టెన్షన్ పడట్లేదని, కానీ ప్రతి వంద ఇండ్లలో దాదాపు 25 నుంచి 30మంది దాకా ఏదో ఒక లక్షణంతో బాధ పడుతున్నట్టు తెలిపారు హెల్త్ టీమ్ వర్కర్లు. అయితే కరోనా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే టెస్టు చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.
Also Read: కరోనా సోకిందో లేదో నిమిషంలో గుర్తించవచ్చు.. ఎలా అంటే?
అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంట్రాక్ట్ లో ఉన్న వారు కూడా పెద్దగా భయపడట్లేదు. ఇందులో దాదాపు 41శాతం మంది టెస్టులకు దూరంగానే ఉంటున్నారు. ఇక జీహెచ్ ఎంసీ పరిధిలో ఇప్పటి దాకా 55వేల ఇండ్లను పరిశీలించగా.. ఇందులో 2200 మంది తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నారు. ఇక పల్లెల్లో కూడా 35శాతం మందికి పైగా ఇలాగే ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నారు.
ఇక శనివారం తెలంగాణలో 4393మందికి కరోనా సోకింది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఒమిక్రాన్ తీవ్రత కేవలం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది. డెల్టా వేరియంట్ మాత్రం మొదటి వారం తీవ్రత తక్కువగా ఉన్నా.. ఆ తర్వాత వారం మాత్రం సీరియస్ గా ఉంటుంది.
Also Read: తెలంగాణలో ఆన్‌లైన్ క్లాసులు.. అంత శాతం హాజరు తప్పనిసరి..!