Senior Leader: వైసీపీలోకి ఆ కీలక సీనియర్ నేత రీఎంట్రీ?
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు దాదాపు వైసీపీకి దూరమైనట్టే. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో గవర సామాజిక వర్గంలో వైసీపీకి పట్టు పోతోంది.

Senior Leader: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీలో చేరనున్నారా? హై కమాండ్ నుంచి ఆయనకు సమాచారం అందిందా? టిక్కెట్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కొణతాల రామకృష్ణ వివాద రహిత నాయకుడు. సౌమ్యుడు కూడా. 2004లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో రామకృష్ణను గుర్తించారు. అన్ని విధాలా ప్రోత్సహించారు. అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా చేశారు. తరువాత మంత్రివర్గంలో తీసుకున్నారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్ద రాణించినంతగా.. జగన్ వద్ద అంత ముద్ర చూపలేకపోవడం విశేషం.
వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నాయకుల్లో కొణతాల రామకృష్ణ ఒకరు. అందుకు తగ్గట్టుగానే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. కొణతాల రామకృష్ణ కోరిక మేరకు తల్లి విజయమ్మను విశాఖ పార్లమెంట్ స్థానానికి 2014 ఎన్నికల్లో పోటీ చేయించారు. కానీ ఓటమి ఎదురైంది. బిజెపి అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోయారు. అటు కొణతాల రామకృష్ణ సైతం ఓటమి చవి చూడడంతో.. కొణతాల పరపతి తగ్గిపోయింది. జగన్ సైడ్ చేయడం ప్రారంభించారు. పరిస్థితిని గమనించిన కొణతాల పార్టీకి దూరమయ్యారు. రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు.
జిల్లాలో కొణతాల రామకృష్ణకు మంచి పేరు ఉంది. రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తారని ముద్ర ఉంది. గవర సామాజిక వర్గానికి చెందిన ఆయన కొద్దిరోజుల కిందట బిజెపిలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు టచ్ లోకి వెళ్లినట్లు టాక్ నడిచింది. అయ్యన్నపాత్రుడు మధ్యవర్తిత్వంతో టిడిపిలో చేరతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వైసీపీలోకి వెళ్తారన్న టాక్ బలంగా నడుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసిపి హై కమాండ్ కొణతాలకు పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు దాదాపు వైసీపీకి దూరమైనట్టే. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో గవర సామాజిక వర్గంలో వైసీపీకి పట్టు పోతోంది. దీనిని గమనించిన జగన్ విశాఖ జిల్లాలో సామాజిక సమతూకం పాటించాలంటే కొణతాల అవసరం ఉందని భావిస్తున్నారు. కొణతాలను పార్టీలోకి ఆహ్వానించి అనకాపల్లి ఎంపీ సీటును అప్పగించాలన్నది జగన్ ప్రణాళిక. అయితే దీనికి కొణతాల పెద్దగా సుముఖత వ్యక్తం చేయనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకవేళ పోటీ చేయాలనుకున్న ఎమ్మెల్యే గానే చేస్తానని అనుచరుల వద్ద చెబుతున్నారు. వైసీపీలో చూస్తే ఎమ్మెల్యే సీట్లు ఖాళీగా లేవు. అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు గుడివాడ అమర్నాథ్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో వైసీపీలోకి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్టు సమాచారం. మరి వైసీపీ హై కమాండ్ ఎటువంటి ఆఫర్ ఇస్తుందో చూడాలి.
