Margadarsi: మార్గదర్శి ప్రధాన ఖాతా సీజ్.. ఖాతాదారులకు డబ్బులెట్లా? రామోజీ ఏం చేయనున్నారు?
అప్పట్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు నమోదు చేసినప్పుడు సాక్షి ఆస్తులు అటాచ్ చేసింది. అప్పట్లో పచ్చ మీడియా గా పేరుపొందిన ఈనాడు విలువలు వలువలు వదిలేసి అడ్డగోలు రాతలు రాసింది.

Margadarsi: ఏపీ సిబిసిఐడి మార్గదర్శి సంస్థకు సంబంధించి 793 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. దీనికి సంబంధించి ఫూల్ ( ప్రధాన) ఖాతాను తన ఆధీనంలో పెట్టుకుంది. ఈ సమయంలోనే ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. గతంలోనూ ఇదే తీరుగా మార్గదర్శిలో సంక్షోభం ఎదురైనప్పుడు చంద్రబాబు నాయుడు మధ్యవర్తిగా రిలయన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరించాడు. 2,300 కోట్ల చెల్లింపులకు సంబంధించి ఈటీవీ తెలుగు మినహా మిగతా చానల్స్ ను రామోజీరావు రిలయన్స్ కంపెనీకి విక్రయించాడు. సోమాజిగూడ లోని ఈనాడు ప్రధాన కార్యాలయాన్ని కూడా విక్రయించాడు.. ఇప్పుడు తాజా సంక్షోభంతో మార్గదర్శి ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది.
ప్రభుత్వం ఎందుకు ఎంటర్ అయిందంటే
ముందుగానే చెప్పినట్టు మార్గదర్శి పేరుతో ప్రజలనుంచి స్వీకరించిన డబ్బుల మొత్తాన్ని ఫూల్ ఖాతా ద్వారా రామోజీరావు తన ఆధ్వర్యంలోని ఇతర కంపెనీలకు మళ్లిస్తున్నాడని ఏపీ సీఐడీ గుర్తించింది.. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో వీటిని ఇన్వెస్ట్ చేస్తున్నాడని చెబుతోంది. వీటి ఆధారంగానే అభియోగాలు మోపింది. వీటికి బలం చేకూర్చుతూ ఫూల్ ఖాతాను తన వద్ద అట్టిపెట్టుకుంది. ఈ లెక్కన 793 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. వాస్తవానికి ఇలా అటాచ్ చేయడం ద్వారా మార్గదర్శి డబ్బులు ఇతర సంస్థల్లోకి మళ్లించడం సాధ్యం కాదు. పైగా ఆ ఆస్తులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. మార్గదర్శి యాజమాన్యం దగ్గర ఈ ఆస్తులు ఉంటే ఖాతాదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ఏపీ సిఐడి వాదిస్తోంది. ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడేందుకే 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తన ఆధీనంలో ఉంచుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలో అగ్రిగోల్డ్ సమయంలో జరిగిన అవకతవకలను గుర్తు పెట్టుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.
సంక్షోభం సృష్టించడమే
అప్పట్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు నమోదు చేసినప్పుడు సాక్షి ఆస్తులు అటాచ్ చేసింది. అప్పట్లో పచ్చ మీడియా గా పేరుపొందిన ఈనాడు విలువలు వలువలు వదిలేసి అడ్డగోలు రాతలు రాసింది. ఈ క్రమంలోనే వాటన్నిటిని తట్టుకొని సాక్షి యాజమాన్యం నిలబడగలిగింది. ప్రస్తుత పరిణామాలు కూడా నాడు తాను పడ్డ బాధను రామోజీరావుకు గుర్తు చేయాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మార్గదర్శి కేసులో తాను ఇంప్లిడ్ అయినప్పుడే తన ఉద్దేశం ఏమిటో రామోజీరావుకు చెప్పకనే చెప్పాడు. మార్గదర్శి లో లొసుగల ఆధారంగా రామోజీరావును మరింత గట్టిగా వత్తే ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు గ్రూప్ సంస్థలకు గుండెకాయ లాంటి మార్గదర్శిలో సంక్షోభం సృష్టించాడు. 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేయించాడు. పూల్ ఖాతాను సిఐడి ఆధీనంలో ఉండేలా చేశాడు. న్యాయపరంగా చిక్కులు ఉండకుండా నిపుణుల సలహాల మేరకు తదుపరి అడుగులు వేస్తున్నాడు. ఒక రకంగా తన చర్యల ద్వారా కొత్తగా మరెవరూ మార్గదర్శిలో చిట్స్ వేయకుండా అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు చిట్స్ వేసిన వారిలో భయం కల్పించాడు. స్థూలంగా చెప్పాలంటే కాకలు తీరిన రామోజీరావును పడుకోబెట్టాడు. తదుపరిగా ఏం చర్యలు తీసుకుంటాడో తెలియదు కానీ మొత్తానికి అయితే రామోజీరావు పై పై చేయి సాధించాడు.
రామోజీరావు ముందున్న మార్గం
జగన్ దెబ్బకు బేల చూపులు చూస్తున్న రామోజీరావు.. తన ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు అప్పటిలాగే ఇప్పుడు కూడా ఆస్తులు తాకట్టు పెట్టడమో లేదా విక్రయించడమో చేస్తారని నిపుణులు అంటున్నారు. అప్పుడంటే రిలయన్స్ ఆదుకుంది. ఇప్పుడు ఎవరు ముందుకు వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం 793 కోట్ల విషయంలో రామోజీరావు అంతగా వణికిపోడని, ఆయన ఆర్థిక స్తంభాలు బలంగానే ఉన్నాయని మరికొందరు అంటున్నారు. గతంలో మార్గదర్శి సంక్షోభంలో ఉన్నప్పటికీ డబ్బులు రొటేషన్ కావడం వల్ల రామోజీరావు పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఈసారి అలా లేదు. పూల్ ఖాతాను స్తంభింపజేయడంతో రామోజీరావుకు కష్టాలు తప్పేలా లేవు. ఈసారి అమ్మేందుకు పెద్ద మొత్తంలో చానల్స్ కూడా లేవు కాబట్టి.. రామోజీ ఫిలిం సిటీ లేదా ఉషా కిరణ్ మూవీస్ తనఖా పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
