IPL Playoffs 2023 Scenario: IPL ప్లే ఆఫ్స్ నుంచి రెండో టీమ్ ఔట్
ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాదు జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టెక్నికల్ గా హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు కొంత వరకు మిగిలే ఉండేవి.

IPL Playoffs 2023 Scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ ఏడాది అన్ని జట్లు దాదాపు మెరుగ్గానే ఆడడంతో ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ లో ఢిల్లీ జట్టు లీగ్ దశలోనే తమ ప్రయాణాన్ని ముగించిన తొలి జట్టుగా నిలవగా, ఈ జాబితాలో చేరింది మరో జట్టు. అదే సన్ రైజర్స్ హైదరాబాద్.
ఈ ఏడాది ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. పలు జట్లు ప్లే ఆఫ్ చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ఏ జట్లు ప్లే ఆఫ్ కు వెళతాయో ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. ఒక జట్టు విజయం, మరో జట్టు పరాజయంపై కొన్ని జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయంటే.. ఈ రేస్ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ లో ఐపీఎల్ లో పది జట్లు పోటీ పడుతుండగా.. ప్లే ఆఫ్ రేసు నుంచి ఢిల్లీ ఇప్పటికే నిష్క్రమించింది. ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేక ఢిల్లీ జట్టు చతికల పడింది. తాజాగా ఎస్ఆర్హెచ్ జట్టు కూడా ప్లే ఆఫ్ వరకు వెళ్లకుండానే ఇంటి దారి పడుతోంది. లీగ్ దశతోనే ఈ ఏడాది తమ ప్రయాణాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కూడా హైదరాబాద్ జట్టు చతికిల పడడంతో ఈ సీజన్ ను లీగ్ దశలోనే ముగించాల్సి వచ్చింది.
రెండో జట్టుగా నిలిచిన హైదరాబాద్..
ఈ ఏడాది ప్లే ఆఫ్ కు వెళ్లకుండానే లీగ్ దశలోనే ఢిల్లీ జట్టు వెనుదిరిగింది. దారుణమైన ఆటతీరుతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను చేజార్చుకుంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ జట్టు నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరో ఎనిమిది మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లు మాత్రమే ఈ జట్టు సాధించింది. ఇక, హైదారాబాద్ జట్టు కూడా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఓటమి చెందింది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలు హైదరాబాద్ జట్టుకు పూర్తిగా చేజారిపోయాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
దారుణంగా ఓడిన హైదరాబాద్ జట్టు..
ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాదు జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టెక్నికల్ గా హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు కొంత వరకు మిగిలే ఉండేవి. ఓటమి పాలు కావడంతో ఆ ఆశలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. గుజరాత్ జట్టు ఓపెనర్ గిల్ అద్భుతమైన ఆట తీరు కనబర్చడంతో భారీ స్కోర్ చేసింది గుజరాత్ జట్టు. గిల్ 58 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సుతో 101 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 47 పరుగులు, చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు అన్మోల్ ప్రీత్ సింగ్ నాలుగు బంతుల్లో 5 పరుగులు, అభిషేక్ శర్మ ఐదు బంతుల్లో నాలుగు పరుగులు, కెప్టెన్ మార్క్రమ్ పది బంతుల్లో పది పరుగులు, రాహుల్ త్రిపాఠి రెండు బంతుల్లో ఒక పరుగు చేసి ఘోరంగా విఫలమయ్యారు. జట్టులో క్లాసెన్ ఒక్కడే 44 బంతుల్లో 64 పరుగులు చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ 26 బంతుల్లో 27 పరుగులు, మయాంక్ మార్కండే 9 బంతుల్లో 18 పరుగులు చేయడంతో హైదరాబాద్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగి 34 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ జట్టులో మహమ్మద్ షమీ నాలుగు, మోహిత్ శర్మ నాలుగేసి వికెట్లు తీసి హైదరాబాద్ జట్టు నడ్డి విరిచారు.
చివరి నుంచి రెండో స్థానంలో..
గుజరాత్ జట్టుపై ఓటమి చెందిన తర్వాత హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో.. చెన్నై, ముంబై, లక్నో జట్లు ఉన్నాయి. బెంగళూరు జట్టు ఐదో స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో, కేకేఆర్ జట్టు ఏడో స్థానంలో, పంజాబ్ కింగ్స్ జట్టు ఎనిమిదో స్థానంలో, హైదరాబాద్ 9వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పదో స్థానంలో కొనసాగుతున్నాయి.
