Sathi Gani Rendu Ekaralu Review: ‘సత్తి గాని రెండెకరాలు’ మూవీ రివ్యూ
చిన్నప్పుడు రెండు ఎకరాల భూమి గురించి తాత సత్తికి చెప్పడంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. తర్వాత సత్తి అతని కుటుంబం, పాపకు అనారోగ్యం, రెండు ఎకరాల భూమి ఈ అంశాలతో దర్శకుడు క్రమక్రమంగా కథలోకి తీసుకెళ్తాడు.

Sathi Gani Rendu Ekaralu Review: కోవిడ్ తర్వాత ప్రేక్షకుడి అభిరుచిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఫలితంగా ఓటీటీలు పుట్టుకు వచ్చాయి. అయితే ఇవి కేవలం సినిమాల స్ట్రీమింగ్ కు మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అంతకుమించి కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇక అలాంటి వాటిలో “ఆహా” ఒకటి. ఇది పెద్ద పెద్ద ఓటీటీలను తట్టుకొని నిలబడగలిగింది అంటే దానికి ఉన్న జెన్యూన్ కంటెంటే. అలాంటి ఈ ఓటీటీ ఇప్పుడు పుష్ప ది రైజింగ్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న జగదీష్ అలియాస్ కేశవ ప్రధాన పాత్రలో “సత్తి గాని రెండెకరాలు” అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అభినవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆహా ఓటీటీ లో నేరుగా విడుదలైంది. అయితే పుష్ప సినిమా ద్వారా తొలి బ్రేక్ అందుకున్న జగదీష్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాం.
కథ ఏంటంటే..
తెలంగాణలోని మారుమూల పల్లెటూరులో సత్తి(జగదీష్ బండారి) ఊర్లో ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అతడి స్నేహితుడు అంజి( రాజ్ తీరన్ దాసు) తో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే సత్తికి ఒక బాబు, పాప సంతానం ఉంటారు. అయితే అకస్మాత్తుగా కూతురికి అనారోగ్యం చేస్తుంది. వైద్యానికి పాతిక లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతారు. అప్పటికే పుట్టేడు అప్పులతో సత్తి దరిద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అయితే ఆ సత్తికి మొన్న ఏకైక ఆస్తి తాత ఇచ్చిన రెండు ఎకరాల భూమి. ఎట్టి పరిస్థితులోనూ ఆ భూమిని అమ్మ వద్దని చెబుతాడు సత్తి తాత. ఆ సెంటిమెంట్ తో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ భూమిని అమ్మేందుకు సత్తి అంతగా ఆసక్తి చూపడు. అయితే ఆ భూమిని అమ్మాల్సిన అనివార్య పరిస్థితి వస్తుంది. గ్రామ సర్పంచ్(మురళీధర్ గౌడ్) ఒక పార్టీని తీసుకొస్తాడు.. ఇక భూమి అమ్మేద్దాం అనుకునే సమయంలోనే సత్య జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కారు ప్రమాదానికి గురవుతాడు. ఘటనా స్థలంలో సత్తికి కారులో ఒక సూట్ కేసు దొరుకుతుంది. ఇంతకీ ఆ సూట్ కేసులో ఏముంది? ఆ సూట్ కేస్ జీవితాన్ని ఎలా మార్చింది? అనేది మిగతా కథ.
ఎలా సాగిందంటే..
చిన్నప్పుడు రెండు ఎకరాల భూమి గురించి తాత సత్తికి చెప్పడంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. తర్వాత సత్తి అతని కుటుంబం, పాపకు అనారోగ్యం, రెండు ఎకరాల భూమి ఈ అంశాలతో దర్శకుడు క్రమక్రమంగా కథలోకి తీసుకెళ్తాడు. అయితే ఈ సన్నివేశాల కోసం దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు అనిపిస్తుంది. కారు ప్రమాదం తర్వాత సినిమా కొంచెం డార్క్ కామెడీ వైపు వెళుతుంది. సత్తికి సూట్ కేసు దొరకడం, దానిని అంజి దగ్గరికి తీసుకెళ్లడం, ఆ సూట్ కేస్ నున్ తెరిచే ప్రయత్నాలు పర్వాలేదు అనిపించినప్పటికీ.. ఎందుకనో అవి అత్యంత సహజంగా ఉండవు. సూట్ కేస్ దొరికిన తర్వాత కథలో వేగం ఎందుకనో పుంజుకోదు. కానీ ఇక్కడ దర్శకుడు చాలా నిదానమైన సన్నివేశాలు రాసుకోవడంతో కథ స్లోగా వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. వాస్తవానికి ఇలాంటి డార్క్ కామెడీలో ట్విస్టులు ఎంగేజింగ్ గా ఉండాలి. అప్పుడే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. కానీ ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ లేవు. ఫలితంగా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఈ సినిమాలో రియాజ్ పాత్ర కూడా చాలా కీలకం. అయితే అతని పాత్రకు, అంజీ, సత్తి పాత్రలకు ముప్పు ఉండేలా సన్నివేశాలు రాసుకుంటే కథలో ఉత్కంఠ ఉండేది.
హాలీవుడ్ సినిమా లాగా..
పైగా ఈ సినిమా ” ఐ కేర్ ఏ లాట్” అనే హాలీవుడ్ సినిమా పోలికలు కనిపిస్తాయి.. ఇక సినిమా నడుస్తున్న కొద్దీ సత్తి, అంజి పాత్రలు కథకు దూరంగా వెళుతూ ఉంటాయి. పైగా అంజి ప్రేమ కథలో పెద్దగా ఆసక్తి ఉండదు. అంజి, అండమ్మ మధ్య ఫ్యామిలీ సీన్లు మాత్రం చాలా సహజంగా తీశారు.. అయితే సినిమా టైటిల్ పేరుకు సత్తి గాని రెండు ఎకరాలు అని పెట్టారు గాని.. ఆ రెండు ఎకరాల కోసం సత్తి చేసే ప్రయత్నాలు పెద్దగా కనిపించవు. భూమికోసం సత్తి పడే తాపత్రయం కూడా గొప్పగా అనిపించదు. సూట్ కేసు డ్రామా ను ఉత్కంఠగా తీసే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు దాన్ని సరిగా వాడుకోలేకపోయాడు.
ఎవరెవరు ఎలా నటించారంటే..
నటన విషయానికొస్తే సత్తి పాత్రలో జగదీష్ జీవించాడు. ముఖ్యంగా భార్య పుట్టింటికి వెళ్లకుండా బతిమిలాడే సన్నివేశంలో అద్భుతంగా నటించాడు. పుష్ప సినిమా తనకు ఎంత గుర్తింపు ఇచ్చిందో..దానిని కొనసాగించేలాగా ఈ సినిమాలో అంత ఈజ్ తో నటించాడు. రాజ్ తీరన్ దాస్ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. అయితే ఈ పాత్రను మరింత బాగా రాసుకుంటే బాగుండేది. వెన్నెల కిషోర్ కు చాలా తక్కువ టిడిపి ఉన్న పాత్ర దక్కింది. ఆయన మంచి కమెడియన్ అయినప్పటికీ దర్శకుడు సరిగా వాడుకోలేదు అనిపిస్తుంది. సత్తి భార్యగా చేసిన మోహన శ్రీ, అంజి ప్రియురాలిగా కనిపించిన అనీషా దామా పర్వాలేదు అనిపించారు. మురళీధర్ గౌడ్, బిత్తిరి సత్తి, రియాజ్ వారి వారి పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమాకు బడ్జెట్ పరిమితులు ఉండడం ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కెమెరా పనితనం, సంగీతం ఓకే అనిపిస్తాయి.
అర్థమయ్యేలా చెప్పడంలో..
ఇక రెండెకరాల కథ పైకి చూసేందుకు పంపించినప్పటికీ దాన్ని అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఒక సామాన్యుడికి అత్యంత విలువైన వస్తువు దొరకడం, దాని విలువ తెలియని పాత్రలు, వాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఇదివరకు చాలా సినిమాల్లో చూసాం. అయితే ఈ కథ కూడా వాటి పరిధిలోకి వెళ్లిపోతుంది. అంతే తప్ప ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన సినిమా అయితే కాదు. నేరుగా ఓటీటీ లో విడుదల చేశారు కాబట్టి నిర్మాతలకు పెద్దగా రిస్క్ ఉండదు. తెలుగు కంటెంట్ తో నిర్మితమైన సినిమా, తెలిసిన నటీనటులు ఉన్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా ఈజీ గానే చూసేస్తారు.
రేటింగ్: 2.5/5