S. Varalakshmi- Senior NTR: ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలుగు నటులే ఉండేవారు. టాలీవుడ్ కూడా చెన్నైలో ఉండేది కాబట్టి అడపాదడపా తమిళ నటులు నటించేవారు. దీంతో నటుల మధ్య మంచి అనుబంధం ఉండేది. అందరూ వరసలు పెట్టి పిలుచుకునేవారు. సీనియర్ నటులను హీరోయిన్స్ బాబాయి గారు అని పిలుస్తూ ఉండేవారు. సెట్స్ లో వరసలతో పిలుచుకోవడం అప్పట్లో ఉండేది. హీరోయిన్స్, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తెచ్చే భోజనాన్ని హీరోలు, ఇతర నటులు షేర్ చేసుకునేవారు. ఈ హోటల్ కల్చర్ అంతగా ఉండేది కాదు. అవకాశం ఉన్నప్పటికీ నటులు ఇంటి వద్ద నుండి భోజనం తెచ్చుకునేవారు.

S. Varalakshmi- Senior NTR
నటులందరూ ఒక కుటుంబంగా బ్రతికిన రోజులు అవి. నందమూరి రామారావు పెద్ద స్టార్ అయినప్పటికీ ఇదే పద్ధతి పాటించేవారట. సెట్ లో ఉన్న నటులు, హీరోయిన్స్ తో చాలా ఆప్యాయంగా, చనువుగా ఉండేవారట. ఆయన ఒక హీరోయిన్ ని కోడలా అని పిలిచేవారట. ఆమె ఎవరో కాదు ఎన్టీఆర్ తో పలు చిత్రాల్లో నటించిన ఎస్ వరలక్ష్మి. ఈ సీనియర్ హీరోయిన్ ఒక సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
నర్తనశాల మూవీలో ఎన్టీఆర్ బృహన్నల పాత్ర చేశారు. ఆ మూవీలో నేను ఆయనకు కోడలిగా నటించాను. అప్పటి నుండి ఎన్టీఆర్ నన్ను కోడలా అని సరదాగా పిలిచేవారు. ఎన్టీఆర్ అంతటి స్టార్ అలా ఆప్యాయంగా పిలుస్తుంటే ఆనందం వేసేది వరలక్ష్మి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరు. ఆయన నుండి అనేక మంచి విషయాలు స్ఫూర్తి పొందాను. ఉదయం ఏడు గంటలకు షూట్ అంటే ఏడు గంటలకు సెట్స్ లో ఉంటారు. వృత్తిపట్ల అంకిత భావం, నిబద్ధత నేను ఎన్టీఆర్ నుండి నేర్చుకున్నాను. ఆయనలోని మరో గొప్ప విషయం పెద్ద స్టార్ అన్న భావన ఉండదు. అందరితో కలిసిపోయేవారు.

S. Varalakshmi
ఎన్టీఆర్ తో నేను ఎన్నో గొప్ప చిత్రాలు చేశాను. నర్తనశాల, పరమానందయ్య శిష్యులు, మంగమ్మ శపథం, పాండవ వనవాసం, రాముడు భీముడు ఇలా అనేక విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించాము. నేను సినిమాల్లోకి వచ్చేనాటికి ఎన్టీఆర్ పెద్ద స్టార్. దీంతో ఆయన అంటే నాకు భయం వేసింది. అందులోనూ మాది సినిమా నేపథ్యం లేని కుటుంబం. అంతకు ముందు ఎలాంటి పరిచయం లేదు. ఆయనే ఆప్యాయంగా ‘ఇలా వచ్చి కూర్చోమ్మా’ అంటూ పలకరించారు. ఆయనతో మాట్లాడాక నాలోని భయం పోయింది. ఎన్టీఆర్ గారితో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.