
RS Praveen Kumar
RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఓ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. కింది స్థాయి నుంచి వచ్చి ఎంతో మంది డ్రీమ్ జాబ్ గా భావించే సివిల్ సర్విసెస్‌కు ఎంపికయ్యాడు. పోస్టింగ్ వచ్చిన తన దగ్గర నుంచి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగిన తన మూలాలను మర్చిపోలేదు. సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న వారిని ఉన్నత శిక్షరాలకు తీసుకురావానికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆయన సేవలు మరింత విస్తృతమయ్యాయి.
సోషల్ వెల్ఫేర్ సొసైటీకి సెక్రటరీగా సేవలు..
రాష్ట్రం సిద్ధించాక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సొసైటీకి సెక్రటరీగా విశేష సేవలు అందించారు. పేద పిల్లలకు బంగారు భవితవ్యం అందిచాలని తాపత్రయపడ్డారు. దానికి అనుగుణంగానే సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో నిబంధనలు కట్టుదిట్టం చేశారు. పిల్లలను చదువుల్లోనూ, ఆట, పాటల్లోనూ ముందుండేలా ప్రోత్సహించారు. చిన్న వయసుల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన నిజామాబాద్‌కు చెందిన మలావత్ పూర్ణ ఓ సోషల్ వెల్ఫేర్ విద్యార్థే. అలాగే మరింతో మందిని మంచి ఉద్యోగులుగా, ఉన్నత విద్యావంతులుగా మలిచిన ఘనత సోషల్ వెల్ఫేర్ స్కూళ్లకు దక్కుతుంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల రూపు రేఖలు మారిపోయాయి. ఇందులో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడ్డారు. ఇందులో చదివిన వారు కచ్చితంగా మంచి నడవడికతో, గొప్ప విద్యావంతులుగా ఎదుగుతారని భావించారు.
డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా..
ఐపీఎస్‌గా ఎంపికైన దగ్గర నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా పేరు సంపాదించుకున్నారు. నిజాయితీగా పనిచేయడం, పక్షపాతం చూపించకపోడవం, విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండటం వంటివి ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అంటే ఒక పేరు కాదు.. అది ఒక బ్రాండ్ గా మారిపోయింది.
చిన్నప్పుడే వివక్ష ఎదుర్కొన్నా..
తాను చిన్నప్పుడే వివక్ష ఎదుర్కొన్నానని, అందుకే తాను ఎదుర్కొన్న కష్టాలు ఎవరికీ రాకూడదని, సమాజంలో వివక్ష పోగొట్టేందుకు ప్రయత్నం చేశానని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే స్వేరోస్ పేరుతో సేవా కార్యక్రమాలు కొనసాగించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సమాజంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే, వివక్ష రూపుమాపాలని, అంబేద్కర్, కాన్షిరాంల స్ఫూర్తితో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయల్లోకి ప్రవేశించారు. బీఎస్‌పీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.
తన నేపథ్యం, రాజకీయాల్లోకి రావడానికి కారణాలు, లక్ష్యం వంటి అన్ని వివరాలు అన్ని మీడియాతో పంచుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. ఇటీవలే ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను స్కూళ్లో చదువుతున్న సమయంలో ఓ స్నేహితుడి చొక్కా బాగుందని పట్టుకుంటే తీవ్రంగా అవమానించారని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు వచ్చిన ఆనందం కంటే రాజకీయాల్లోకి వచ్చాక ఎక్కువ సంతోషంగా ఉన్నానని తెలిపారు. రాజకీయాల్లో తిమింగలాలు, మొసళ్లు, మేకవన్నె పులులు ఉంటాయని తనకు తెలుసని, వాటిని గురించే తెలిసే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
తాను ఐపీఎస్ అయిన విషయం తెలిసిన తన ప్రొఫెసర్ ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. ‘‘ ప్రవీణ్ నువ్వేదో రౌడీవి అవుతాననుకున్నాను. కానీ నువ్వు ఐపీఎస్ ఆఫీఎస్ అవుతావని అస్సలు అనుకోలేదు’’ అంటూ నవ్వుతూ గతాన్ని గుర్తుచేసుకున్నారు. తాను ఇంకా లేట్ చేస్తే ప్రజల్లో ప్రశ్నించేతత్వం తగ్గిపోతుందనే ఉద్దేశంతో తొందరగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తనకు సీఎం కేసీఆర్ టార్గెట్ కారని, కానీ మేము ఆయనకు ఎప్పుడూ టార్గెటే అని చెప్పారు. గడిచిన ఏడేళ్లలో ఎస్సీ కార్పొరేషన్‌కు ఇచ్చిన నిధుల ఎంతో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ వంటి నాయకులను ఈ నాయకులు రానివ్వడం లేదని అన్నారు. ఇలా తన మనసులోని ఉన్న భావాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.