Uncle Affection : సహజంగా అమ్మాయిలకు మగవారి మీద, అబ్బాయిలకు ఆడవారి మీద ప్రేమ ఉండటం కామనే. కూతుళ్లకు నాన్నంటే కొడుకులకు అమ్మంటే ఇష్టపడతారు. వారితోనే ఫ్రీగా ఉంటారు. ఇలా అన్యోన్యత అనేది ఆడపిల్లల విషయంలో ఎక్కువగానే ఉంటుంది. అందులో మేనకోడలంటే అందరికి ఇష్టమే. బిడ్డలతో సమానంగా చూసుకుంటారు. వారికి ఏది ఇష్టమైతే అది కొనివ్వడం సహజమే. అందుకే తండ్రి మీద కంటే ఆడపిల్లలకు మేనమామల మీదే అధికారం ఉంటుంది. మామ నాకు అది కావాలంటే క్షణాల్లో కొనిచ్చేందుకే మొగ్గు చూపుతారు. అందుకే తండ్రి లేకపోయినా మేనమామ ఉండాలని చెబుతుంటారు.
మేనకోడలి కోసం..
మేనకోడలి పెళ్లి అంటే మామలకు సంబరమే. ఆమెకు తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత పెట్టి పెళ్లి చేయడానికి మేనమామలు ముందుకొస్తారు. తలో ఇంత వేసుకుని ఆమె మనసు నొచ్చుకోకుండా లాంఛనాలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇంకా కొందరైతే పెళ్లి ఖర్చులు పెట్టుకుని తమ ప్రేమను చాటుకుంటుంటారు. అలా మేనకోడలి కోసం త్యాగాలు చేసే వారు సైతం ఉంటారు. అందరి గుణం ఒకే తీరుగా ఉండదు. కొందరు తప్పించుకునే వారు కూడా ఉంటారు. ఇంకా కొందరు సర్వస్వాన్ని పెడుతుంటారు.
రాజస్థాన్ లో..
తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో మేనమామలు కోడలి పెళ్లి కోసం ఏకంగా రూ. 3.21 కోట్లు ఇవ్వడం సంచలనం కలిగించింది. నాగౌర్ జిల్లాలోని బుర్డీ గ్రామానికి చెందిన హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్ర అనే ముగ్గురు అన్నదమ్ములు తమ మేన కోడలి కోసం ఇంత మొత్తం ఆస్తులు కట్నంగా ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు. కూతుళ్లకే ఇవ్వడానికి ఇష్టపడని వారున్న సందర్భంలో మేనకోడలికి ఇంత భారీ మొత్తం కట్నంగా ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారు. మేనకోడలిపై ఉన్న ప్రేమకు అవాక్కవుతున్నారు.
ముగ్గురు సోదరులు..
ముగ్గురు సోదరులు కలిసి కోడలికి 10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 30 లక్షల విలువ చేసే స్థలం, 41 తులాల బంగారం, 3 కిలోల వెండి, ఓ ట్రాక్టర్, స్కూటీ, రూ. 80 లక్షల నగదు అప్పగించారు. దీంతో ఊళ్లోని ప్రతి ఇంటికి ఓ వెండి నాణెం కానుకగా అందించారు. దీంతో మేనకోడలిపై వారికి ఉన్న ప్రేమ ఎంతటిదో అర్థమవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చి పెళ్లి చేసేందుకు వారు ముందుకు రావడం గమనార్హం. అన్నదమ్ముల అనుబంధానికి మేనకోడలు మురిసిపోతోంది.