RRR in Oscar nominations : ఆర్ఆర్ఆర్ విడుదలై దాదాపు 10 నెలలు అవుతుంది. ఏదో ఒక రూపంలో ఆ సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంది. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్ ఈ సినిమాని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. మూవీ అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. రాజమౌళి అన్ని పనులు వదిలేసి అమెరికాలో తిష్ట వేశాడు. పలు అంతర్జాతీయ వేదికలపై ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించేలా చూశారు. ఆయనకు అంతర్జాతీయ అవార్డ్స్ దక్కాయి. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుతో గౌరవించబడ్డారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంతో ఇండియా మొత్తం ప్రౌడ్ గా ఫీలైంది.
అమెరికన్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ గురించి వార్తలొచ్చాయి. రాజమౌళి ప్రతిభను కొనియాడుతూ ఆర్టికల్స్ ప్రచురించారు. ఇదంతా ఆస్కార్ టార్గెట్ గా జరిగిన తంతు. అకాడమీ సభ్యులను ఆకర్షించేందుకు చేసిన ఏర్పాటు వంటిది. ఆస్కార్ గెల్చుకోవడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం. సినిమాలో కంటెంట్ ఉన్నప్పటికీ అది అకాడమీ జ్యూరీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాలి. వారికి మన మూవీ గురించి తెలిసేలా చేయాలి. హాలీవుడ్ చిత్రాలకు ఆ అవసరం లేదు. వరల్డ్ వైడ్ మార్కెట్ ఉన్న పరిశ్రమ కావడంతో మంచి సినిమా గురించి ఆటోమేటిక్ గా చర్చ జరుగుతుంది.
ఒక ఇండియన్ మూవీ అది కూడా రీజనల్ లాంగ్వేజ్ మూవీ గురించి వరల్డ్ వైడ్ చర్చ జరగాలంటే చిన్న విషయం కాదు. అందుకు పిఆర్ ఏజెన్సీల అవసరం తప్పనిసరి. టాలీవుడ్ లో ఓ మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు పిఆర్ టీం ఎలా పని చేస్తుందో… ఆస్కార్ ఓటింగ్ లో పాల్గొనే వేల మందికి మన మూవీ గురించి తెలిసేలా చేసేందుకు స్పెషల్ ఏజెన్సీలు ఉన్నాయి. అవి కోట్లలో ఛార్జ్ చేస్తాయి. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి పనిచేసిన పిఆర్ ఏజెన్సీలు దాదాపు రూ. 50 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
యాభై కోట్లు అంటే ఓ స్టార్ హీరో రెమ్యునరేషన్. ఆస్కార్ కల ఎలాగైనా నెరవేర్చుకోవాలని రాజమౌళి ఖర్చుకు వెనుకాడకుండా ముందుకు వెళ్లారు. ఈ డబ్బులు ఎవరు ఖర్చు చేశారనేది ఆసక్తికరం. వాస్తవంగా డివివి దానయ్య భరించాలి. మొదటి నుండి ఈ క్యాంపైన్ లో దానయ్య ఇన్వాల్వ్ అయిన దాఖలాలు లేవు. బహుశా అందుకే ప్రపంచ సినిమా వేదికలపై రాజమౌళి దానయ్య పేరెత్తడం లేదు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ కి ఒక అడుగు దూరంలో ఆర్ ఆర్ నిలిచిన నేపథ్యంలో అవార్డు కొడితే పెట్టిన పెట్టుబడికి పూర్తి న్యాయం జరుగుతుంది.