Rohit Sharma : ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మకు హిట్ మాన్ అనే పేరు ఉంది.. ఎలాంటి సందర్భంలోనైనా బీభత్సంగా ఆడతాడు అనే పేరు ఉంది.. దురదృష్టవశాత్తు గత మూడేళ్ల నుంచి అతడు ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నప్పటికీ అవి కేవలం హాఫ్ సెంచరీ అవతల వైపే ఉంటున్నాయి.. వంద మార్క్ ను మాత్రం దాటడం లేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో పూర్వ ఫామ్ అందుకున్నాడు . మొదటి మ్యాచ్లో హాప్ సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయ్యాడు.. రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక మూడో మ్యాచ్లో ఒకప్పటి రోహిత్ శర్మ ఎలా ఆడేవాడో న్యూజిలాండ్ బౌలర్లకు రుచి చూపించాడు.. 85 బంతుల్లోనే 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
పలు రికార్డులు బద్దలు
రోహిత్ శర్మ సెంచరీ చేసి పలు కీలక రికార్డులు బద్దలు కొట్టాడు. శ్రీలంక సిరీస్ లో రెండు శతకాలతో విరాట్ కోహ్లీ తన ఫామ్ చాటుకున్నాడు.. ఇప్పుడు రోహిత్ కూడా ఫామ్ లోకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి కివీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన రోహిత్ శర్మ… గతి తప్పిన ప్రతి బంతిని బౌండరీ వైపు మళ్ళించాడు.. ఇండోర్ బౌండరీ చిన్నది కావడంతో ఎడాపెడా ఫోర్లు బాదేశాడు. అంతేకాదు భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ధోని పేరిట ఉన్న రికార్డును ఇటీవలే బద్దలు కొట్టిన రోహిత్… కివిస్ తో జరిగిన వన్డేలో మరో అడుగు ముందుకు వేశాడు.. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో సనత్ జయ సూర్యను దాటేశాడు.
ఇక ఈరోజు జరిగిన మ్యాచ్లో తన సెంచరీ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు బాదిన రోహిత్.. ఆరు సిక్సర్లు కూడా కొట్టాడు.. దీంతో అతను వన్డేల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 272 కు చేరింది. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి రోహిత్ చేరాడు.. ఇంతకాలం ఈ రికార్డు సనత్ జయసూర్య పేరిట ఉండేది. అతను తన కెరియర్లో 250 సిక్సర్లు బాదాడు. ఇక ఈ జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది 351, క్రిస్ గేల్ 331 సిక్సర్లతో ముందు ఉన్నారు. రోహిత్ కనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే సులభంగా వాళ్ళిద్దర్నీ కూడా దాటేస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.. న్యూజిలాండ్ తో టి20 సిరీస్ ముగిసిన తర్వాత, ఆస్ట్రేలియా మనదేశంలో పర్యటిస్తుంది.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది.. ప్రస్తుతం రోహిత్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో గేల్ రికార్డు బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.