AP Revenge Politics: ఏపీలో ప్రతీకార రాజకీయాలు.. తమిళనాడు తరహాలో
గతంలో చంద్రబాబు చేతిలో బాధితులుగా నిలిచిన వైసీపీ నాయకులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మంత్రి రోజా లాంటి నేతలు స్వీట్లు పంచుకున్నారు.

AP Revenge Politics: ఏపీలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరుతున్నాయి. తమిళనాడు తరహా రాజకీయాలకు నేతలు బీజం వేశారు. తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పగ, ప్రతీకార రాజకీయాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ప్రమాణ స్వీకారం నాడే అటువంటి రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. అయితే అక్కడ ఎండ్ కార్డు పడినా.. ఏపీలో ఆతరహా రాజకీయాలు ప్రారంభం కావడం ఆందోళన కలిగిస్తోంది.గతంలో ఏపీ సీఎం జగన్ జైలుకు వెళ్ళగా.. దానికి కారణమైన చంద్రబాబును తాజాగా జైలుకు పంపించడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
గతంలో చంద్రబాబు చేతిలో బాధితులుగా నిలిచిన వైసీపీ నాయకులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మంత్రి రోజా లాంటి నేతలు స్వీట్లు పంచుకున్నారు. డాన్సులు వేసి సంబరాలు చేసుకున్నారు. సహజంగా ఇది తెలుగుదేశం పార్టీ నేతలకు రుచించని విషయం. రోజా లాంటి నేతలపై రుస రుసలాడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రోజాకు రాజమండ్రి జైలుకు పంపిస్తామని టిడిపి నేతలు బాహటంగానే ప్రకటిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. జాతీయ మీడియా సంస్థల ముఖాముఖిలో లోకేష్ పాల్గొంటున్నారు. గత నాలుగున్నర ఏళ్ల జగన్ విధ్వంసం పాలన, ప్రత్యర్థులపై కేసులు, దాడుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కచ్చితంగా వైసీపీ నేతలు ఇంతకింతకు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దాదాపు 150 మంది వరకు వైసిపి నేతలు, అధికారులు తమ టార్గెట్ అని లోకేష్ చెప్పుకొస్తున్నారు. అందుకు సంబంధించి ప్రత్యేక డైరీ కూడా రాస్తున్నట్లు నేషనల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. దీంతో ఏపీ పరిస్థితులపై జాతీయస్థాయిలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
ఎక్కడైనా పాలకపక్షం పాలనను విడిచిపెట్టి ప్రత్యర్థులపై రాజకీయ కక్ష కు పాల్పడితే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. గతంలో తన జైలు జీవితానికి చంద్రబాబుతో పాటు టిడిపి నాయకులే కారణమని జగన్ భావించారు. అందుకే అధికారం వచ్చిన నాటి నుంచి వెంటాడుతున్నారు. ఎట్టకేలకు చంద్రబాబు వంతు వచ్చింది. త్వరలో లోకేష్ ను సైతం అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై లోకేష్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే తమ వేటను సైతం ముందుగానే ప్రకటిస్తున్నారు. మొత్తానికైతే ఏపీలో రాజకీయాలు పగ, ప్రతీకారంతో కలుషితం కావడం ఆందోళన కలిగిస్తోంది.
