YCP Sittings Alternative : ఆ సిట్టింగుల స్థానాల్లో ప్రత్యామ్నాయం రెడీ
ఇప్పటికే ఎమ్మెల్సీలను రెడీగా పెట్టుకున్నారు. అటు తప్పనిసరి మార్చాల్సిన ఎమ్మెల్యేల విషయంలో స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు.

YCP Sittings Alternative : వైసీపీలో కీలక పరిణామాలకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. కర్నాటకలో బీజేపీ మాదిరిగా సిట్టింగులకు, సీనియర్లను పక్కనపెట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచే సీఎం జగన్ కేబినెట్ భేటీకి ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అది ముందస్తు సన్నాహాల్లో భాగమేనన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది సిట్టింగులను పక్కకు తప్పస్తారన్న ప్రచారం ఉంది. ఎన్నికలకు పట్టుమని ఏడాది కూడా లేకపోవడంతో కేబినెట్ మీటింగ్ లో దీనిపై స్పష్టమైన సంకేతాలిస్తారని తెలుస్తోంది.
ముఖ్యంగా 20 మంది ఎమ్మెల్యేలను తప్పించడం తప్పనిసరి. వారి పనితీరు మెరుగుపడకపోవడంతో మార్పు అనివార్యం. సామాజిక సమీకరణలతో మరో 20 మందిని సైతం మార్చాల్సిన తప్పని పరిస్థితి. గతసారి ఒక ఊపులో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారూ ఉన్నారు. అసలు ఆ స్థాయి విజయం దక్కుతుందని సాక్షాత్ జగన్ కు కూడా తెలియని పరిస్థితి. టిక్కెట్ దక్కించుకోవడమే తరువాయి జాక్ పాట్ కొట్టేసిన వారూ ఉన్నారు. అటువంటి వారిలో చాలా మంది ఎమ్మెల్యే హోదాను వెగలబెట్టారు. కానీ ప్రజామోదం దక్కించుకోలేకపోయారు. అటువంటి వారి మార్పు తప్పనిసరి అని వైసీపీ హైకమాండ్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కోస్తాంధ్ర, గోదావరి జిల్లాలో సమీకరణలు మారిపోతాయి. కాపు, కమ్మ ఓట్లు ఏకమయ్యే చాన్స్ ఉంది. అటువంటి చోట సామాజిక సమీకరణలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించాలి. కూటమి ఉమ్మడి అభ్యర్థి సామాజికవర్గాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి చోట అదే సామాజికవర్గానికి చెందిన నాయకుడ్ని బరిలో దించాలి. అప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి. అటువంటి చోట సిట్టింగులకు మొండిచేయి తప్పదు. ఇలా పక్కకు తప్పించిన వారిని ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. ఒకేసారి 40 మంది సిట్టింగులకు తప్పించడం అంటే చిన్నపనికాదు. అది సాహసంతో కూడుకున్నది. దీనిని ఎలా అధిగమిస్తారన్నది వైసీపీ హైకమాండ్ కు పెద్ద టాస్కే.
ఈ విషయంలో జగన్ ముందుచూపుతో వ్యవహరించారు. ఇప్పటికే ఎమ్మెల్సీలను రెడీగా పెట్టుకున్నారు. అటు తప్పనిసరి మార్చాల్సిన ఎమ్మెల్యేల విషయంలో స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. సామాజిక సమీకరణలతో కొన్ని నియోజకవర్గాల్లో మార్చాల్సి వస్తే అక్కడ ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారిని లైన్ లోకి తేనున్నారు. వారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని భావిస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
