
విశాఖ, విజయనగరం జిల్లాలలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని భావించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం నుండి విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి అడుగు కూడా బయట పెట్టలేక పోయారు. షరతులతో కూడిన పోలీసుల అనుమతులను భేఖాతర్ చేస్తారేమో అనేది ఒక కారణమైతే.. వైసీపీ శ్రేణులు చంద్రబాబును అడ్డుకోవడం ప్రధాన కారణం.
చంద్రబాబు పర్యటనకు ముందస్తు అనుమతులు ఉన్నాయని.. పోలీసులు చెప్పిన తర్వాతే తాము పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పత్రాలు మాదగ్గర ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయ కక్షను తీర్చుకోవడానికి విశాఖ ఎయిర్ పోర్ట్ ను అడ్డాగా మార్చుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసుల అనుమతి ఉన్నా.. వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
2017 జనవరి 26న విశాఖ పర్యటనకు నాటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అయితే ఇదే ఎయిర్ పోర్టులోనే పోలీసులు, టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకున్నారు. అయితే నాటి సంఘటనకు నేడు జరుగుతున్న దానికి ఏమాత్రం పోలిక లేదని టీడీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. ఆనాడు అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఉండటంతో జగన్ ను అనుమతించలేదని టీడీపీ నేతలు అంటున్నారు.