Sunrisers Hyderabad : ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాభవానికి కారణాలివే..!
హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగం ఈ ఏడాది పూర్తిగా తేలిపోయింది. సాధారణంగా హైదరాబాద్ జట్టు బౌలింగ్ బలంగా ఉంటుంది. అనేక సీజన్లు బౌలింగ్ తోనే నెట్టుకుంటూ వచ్చింది. ఈ ఏడాది పూర్తిగా తేలిపోయింది.

Sunrisers Hyderabad : ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2023 కూడా హైదరాబాద్ జట్టుకు కలిసి రాలేదు. ఆటగాళ్లు మారినా.. సారధి మారినా.. కోట్లాది రూపాయలతో స్టార్ ఆటగాళ్ళను కొనుగోలు చేసినా హైదరాబాద్ జట్టు ప్రదర్శన మాత్రం మారలేదు. గడిచిన రెండు సీజన్ల మాదిరిగానే.. ఈ ఏడాది కూడా పేలవ ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్ చేరకుండానే హైదరాబాద్ ఇంటిదారి పట్టింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది హైదరాబాద్ జట్టు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ ప్రయాణం దారుణంగా సాగింది. జట్టులోని ఆటగాళ్లలో సమిష్టి ప్రదర్శన కొరవడడంతో అనేక మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది హైదరాబాద్ జట్టు. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్ ల్లో గెలిచిన ఉపయోగం లేదు. గడిచిన రెండు సీజన్లలో కూడా ఇలాంటి ఆట తీరే జట్టు ప్రదర్శించడంతో యాజమాన్యం పునరాలోచించింది. జట్టులోని ఆటగాళ్లను మార్చింది. ఈ సీజన్లో మెరుగైన ఆట తీరు కనబరచాలనే ఉద్దేశంతో.. వేలంలో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయినప్పటికీ మెరుగైన ప్రదర్శన చేయలేక చేతులెత్తేసింది. ముఖ్యంగా మూడు అంశాలు హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో పతనానికి దోహదం చేశాయని చెబుతున్నారు.
విదేశీ ఆటగాళ్ల దారుణ వైఫల్యం..
సాధారణంగా ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్లు ప్రదర్శన కొంత మెరుగ్గా ఉంటుంది. ఏ జట్టులోని విదేశీ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతారో.. ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుంది. హైదరాబాద్ జట్టులో ఈ ఏడాది అదే కొరవడింది. హెన్రిచ్ క్లాసెన్ మినహా జట్టులోని విదేశీ ఆటగాళ్ళంతా దారుణంగా విఫలమయ్యారు.. రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ తన పేలవ ప్రదర్శనతో జట్టును నట్టేట ముంచేశాడు. కేకేఆర్ జట్టుపై సెంచరీ మినహా ప్రతి మ్యాచ్ లో అతను దారుణంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్ ల్లో 20.38 సగటుతో 163 పరుగులు మాత్రమే చేశాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ మార్క్రమ్ కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. 11 మ్యాచుల్లో 21.70 సగటుతో 217 పరుగులు మాత్రమే చేశాడు. గ్లెన్ ఫిలిప్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. వీరి వైఫల్యం క్లాసెన్ ఆటను దెబ్బతీసింది. అతను ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి తోడు భారత స్టార్ బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ వైఫల్యం హైదరాబాద్ జట్టు కొంప ముంచింది.
పూర్తిగా తేలిపోయిన బౌలింగ్ విభాగం..
హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగం ఈ ఏడాది పూర్తిగా తేలిపోయింది. సాధారణంగా హైదరాబాద్ జట్టు బౌలింగ్ బలంగా ఉంటుంది. అనేక సీజన్లు బౌలింగ్ తోనే నెట్టుకుంటూ వచ్చింది. ఈ ఏడాది పూర్తిగా తేలిపోయింది. హైదరాబాద్ జట్టు నుంచి ఏ ఒక్కరు కూడా పర్పుల్ క్యాప్ బోర్డులో చోటు దక్కించుకోలేకపోయారు అంటే ఏ స్థాయిలో ప్రదర్శన ఉందో అర్థం చేసుకోవచ్చు. భువనేశ్వర్ కుమార్ కాస్తో కూస్తో వికెట్లు తీసినా.. ధారాళంగా పరుగులు ఇచ్చాడు. మార్కో జాన్సన్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూకి కూడా దారుణంగా విఫలమయ్యారు. మయాంక్ మార్కండే ఒక్కడే పరవాలేదు అనిపించాడు. పది మ్యాచ్ ల్లో 12 వికెట్లు తీశాడు.
సులభంగా గెలవాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసి..
ఈ సీజన్ లో అనేక మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు సులభంగా గెలవాల్సి ఉన్నప్పటికీ చివరలో చేతులెత్తేసి ఓటమి పాలయ్యింది. సునాయాసంగా గెలిచే మ్యాచ్ ల్లో ఓడిపోవడం హైదరాబాద్ జట్టుకు అలవాటుగా మారిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంగిట బోర్లా పడింది. లక్నోతో సొంత గడ్డపై చివరి ఏడు ఓవర్లలో 90 పరుగులు ఇచ్చి చేజేతులా విజయాన్ని చేజార్చుకుంది. అభిషేక్ శర్మకు బౌలింగ్ ఇస్తూ మార్క్రమ్ చేసిన తప్పిదం జట్టు పతనాన్ని శాసించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేదించలేకపోయింది. చేతిలో ఐదు వికెట్లు పెట్టుకుని చివరి ముప్పైవంతులు 38 పరుగులు చేయలేక ఓటమికి తలవంచింది. ఈ మూడు మ్యాచ్లు గెలిచి ఉంటే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ రేసులో ముందు వరుసలో నిలిచి ఉండేదని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
