Ravi Shastri On Rohit Sharma: రోహిత్‌కు ఇక కష్టకాలమేనా.. రవిశాస్త్రి మాటల్లో ఆంతర్యం అదేనా?
మూడేళ్ల కిందట ముంబై టీమ్ బాగున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ పని సులువూంది. రెండేళ్లుగా జట్టు వరుస వైఫల్యాలతో అతనికి సవాళ్లు రెట్టింపయ్యాయని రవిశాస్త్రి పేర్కొన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో గత సీజన్‌లో ముంబై చివరి స్థానానికి పరిమితమైంది.

Ravi Shastri On Rohit Sharma: టీమిండియా కెప్టెన్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు.. ఐపీఎల్‌లో జట్టు ఓటములు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పేలవమైన ప్రదర్శన, మరోవైపు జట్టును విజయపథంలో నడిపించడంలో వైఫల్యంతో రోహిత్ కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఇలాంటి పరిస్థితి టీమిండియాకు అంత మంచిది కాదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ కోచ్, సీనియర్ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతా బాగున్నప్పుడు ఎవరైనా గెలిపిస్తారు.. కష్టసమయంలో జట్టును ముందుండి నడిపించేవాడే నిసమైన సారథి అన్నట్లు రోహిత్ కెప్టెన్సీపై వ్యాఖ్యానించాడు. ఓ కెప్టెన్‌గా రోహిత్‌కు సవాళ్లు రెట్టింపయ్యాయని అభిప్రాయపడ్డాడు.
వరుస వైఫల్యాలు..
మూడేళ్ల కిందట ముంబై టీమ్ బాగున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ పని సులువూంది. రెండేళ్లుగా జట్టు వరుస వైఫల్యాలతో అతనికి సవాళ్లు రెట్టింపయ్యాయని రవిశాస్త్రి పేర్కొన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో గత సీజన్‌లో ముంబై చివరి స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాది కూడా 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి, మరో ఐదు ఓడి ఆరోస్థానంలో ఉంది. ఇక రోహిత్ బ్యాటింగ్ కూడా దారుణంగా ఉంది. పది మ్యాచ్ లలో అతడు కేవలం 184 రన్స్ మాత్రమే చేశాడు. చెన్నైతో మ్యాచ్‌లోనూ అతడు మరోసారి డకౌటయ్యాడు. దీంతో రవిశాస్త్రి రోహిత్ కెప్టెన్సీపై స్పందించాడు.
వ్యక్తిగత ఆటపై కెప్టెన్సీ ప్రభావం..
రోహిత్ వ్యక్తిగత ఆటపై కెప్టెన్సీ ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. బాగా పరుగులు చేస్తున్నప్పుడు కెప్టెన్సీ కూడా సులువు అవుతుందని తెలపాడు.ఫీల్డ్‌లో బాడీ లాంగ్వేజ్ కూడా వేరేగా ఉంటుందని.. ఫుల్ ఎనర్జీతో కనిపిస్తారని పేర్కొన్నాడు. కానీ పరుగులు చేయలేకపోయినప్పుడు ఎంతటి ప్లేయర్ అయినా ఏమీ చేయలేడు అని స్పష్టం చేశాడు.
జట్టు పరిస్థితులు కూడా..
ముంబై జట్టులో రెండు మూడేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేకపోవడం కూడా రోహిత్ కెప్టెన్సీకి సవాల్‌గా మారాయని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇలాంటి టీమ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? వాళ్లను ఎలా మోటివేట్ చేయాలి? ఓ కాంబినేషన్ ఎలా క్రియేట్ చేయాలి? అనేవి పెద్ద సవాల్ అన్నారు. రెండేళ్ల కిందటితో పోలిస్తే కెప్టెన్ పని కూడా రెట్టింపైందని తెలిపారు. అప్పుడంతా బాగుండడంతో పని చాలా సులువయ్యేదని, ఇప్పుడెలా ఉన్నా కెప్టెన్సీ అయితే చేయాలి అని పేర్కొన్నారు.
రోహిత్ గతంలో అద్బుతం చేశాడు. ఇప్పుడు అది కష్టం. అతని టీమ్ మునుపటిలా లేదు. అప్పటి టీమ్ బాగుండేది. వచ్చే రెండేళ్లలో ఈ టీమ్ సక్సెస్ కావచ్చు. కానీ ఆ దిశగా సరైన టీమ్‌ను రోహిత్ తయారు చేయాలి అని రవిశాస్త్రి సూచించారు. అయితే అది సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్టు ఎంపిక పూర్తిగా మేనేజ్‌మెంట్ నిర్ణయమే. ఈ సీజన్‌లో జట్టులో ఉన్న క్రికెటర్లు.. వచ్చే సీజన్‌లో ఉంటారో లేదో తెలియదు. ఈ పరిస్థితిలో టీమ్‌ను సిద్ధం చేయడం కెప్టెన్‌కు సవాలే!
