Aarudra : రామోజీరావు బ్లాంక్ చెక్కునే రిటర్న్ పంపిన ‘ఆరుద్ర’.. ఏంటా కథ!
మూత్రపిండాల వ్యాధితో నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు మాగుంట సుబ్బారామిరెడ్డిగారు నాకు సహాయం చేశారు. నేను ఆయనకు రుణపడి ఉన్నా. ఆయన ఒక వీక్లీ పెట్టే ఆలోచన ఉందని తెలిసి, ఆయన అడక్కపోయినా దానికోసం పనిచేస్తానని మాటిచ్చాను. అందువలన మీరిచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోలేకపోతున్నా’’ అంటూ లెటర్ ముగించారు. ఈ లెటర్‌తోపాటు రామోజీరావు గారి బ్లాంక్ చెక్ వెనక్కి వెళ్లిపోయింది. సాహిత్య పత్రిక ఆలోచన వాయిదా పడింది.

Aarudra : ఆరుద్ర… సినీ పాటల రచయితగా చాలా మందికి పరిచయం ఉన్న పేరు. పర్సనాలిటీని గుర్తించకపోయినా.. పేరు సుపరిచితమే. ఆరుద్రని గనక ఒక్కసారి కలిసి ఉంటే.. ఆయనతో మాట్లాడి ఒక్కకాఫీ తాగగలిగి వుంటే, ఆరుద్రతో ఒక్కరోజు గడపగలిగి ఉంటే, ఆయన ఉపన్యాసం వినగలిగి వుంటే.. ఎంత బాగుండు అనిపిస్తుంది తెలుగు సాహిత్యాభిమానులకు.. ‘అపరాధ పరిశోధకుణ్ణి’ కలిశాను అని గొప్పగా చెప్పుకుంటారు ఆయనతో కలిసినవారు. ఆ అవకాశం సీనియర జర్నలిస్ట్ తోట భావనారాయణకు దక్కింది. మద్రాసు నగరంలో ఆరుద్రతో ఏకంగా ఐదేళ్లు స్నేహం చేశాడు. కబుర్లు, జోకులు, గ్రీన్ టీ లు రుద్ర డిక్టేట్ చేస్తుంటే ఇష్టంగా, శ్రద్ధగా రాయడం.. తస్సాదియ్యా, అనుభవం అంటే అది కదా! ఆరుద్ర పాదముద్రలతో పునీతమైన తెలుగుసాహితీపూదోటలో భావనారాయణ పోగుజేసుకున్న పరిమళాల జ్ఞాపకాలివి..
‘‘1993లో ఆంధ్రప్రభలో చాలా మార్పులు తీసుకురావాలని ఎడిటర్ దీక్షితులు నిర్ణయించుకున్నారు. రకరకాల సప్లిమెంట్లతోబాటు సినిమా సమాచారం పెంచటం, ఆదివారం అనుబంధంలో కొత్త శీర్షికలు ప్రవేశపెట్టటం లాంటివి అందులో చాలా ఉన్నాయి. అలాంటి కొత్త శీర్షికలలో ఒకటి ఆరుద్రగారి జ్ఞాపకాలు రాయించటం. అప్పుడు నేను మద్రాస్ ఆంధ్రప్రభలో ఉండటం వల్ల వారం వారం ఆయన దగ్గరికెళ్లి రాయించి తీసుకొచ్చే బాధ్యత నాకప్పజెప్పారు. దీక్షితులు గారు అప్పటికే ఆరుద్రగారికి ఫోన్ చేసి ఒప్పించి ఉండటంతో నేను వెళ్లి పరిచయం చేసుకోవటం కొంత సులువే కావచ్చు గానీ, అంత పెద్దాయనను కలుసుకోబోతున్నానన్న నిజం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏమైతేనేం, కలం పేరుతో ‘ఆరుద్ర’గా అందరికీ తెలిసిన భాగవతుల సదాశివ శంకరశాస్త్రి లాంటి పేరుమోసిన సినీ గీత రచయిత, 13 సంపుటాల సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర వెలువరించిన పరిశోధకుడు, అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకులలో ఒకడు, అనేక సాహితీ ప్రక్రియలలో ప్రతిభను చాటినవాడు అయిన ఆరుద్ర అనే మహానుభావుణ్ణి కలుసుకున్నా.
