Ramoji Rao Vs Jagan: రాజగురువు పథక రచన ఇది
చంద్రబాబును పవన్ కలుస్తున్నారని ముందుగా లీకులు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే పవన్ రాజమండ్రి హుటాహుటిన వచ్చారు. టిడిపితో కలిసి నడుస్తామని ప్రకటించారు.

Ramoji Rao Vs Jagan: తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది. అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నారు. తండ్రిని జైలు నుంచి విడిపించడంతో పాటు పార్టీకి దిశా నిర్దేశం చేయడంలో లోకేష్ సతమతమవుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ ఎంటర్ అయ్యారు. పొత్తుల ప్రకటనలు చేశారు. అదే సమయంలో జాతీయస్థాయిలో నేతలు స్పందిస్తున్నారు. అయితే ఈ శరవేగంగా పావులు కదపడం వెనక రాజగురువు ఉన్నారా? అన్న అనుమానం కలుగుతోంది. నాటి నాదెండ్ల ఎపిసోడ్ నుంచి రాజకీయాల్లో ఆరితేరిన ఆ మీడియా మొగల్ పని ఫలితమే ఇదంతా అని ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబును పవన్ కలుస్తున్నారని ముందుగా లీకులు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే పవన్ రాజమండ్రి హుటాహుటిన వచ్చారు. టిడిపితో కలిసి నడుస్తామని ప్రకటించారు. తక్షణం రెండు పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆ వెంటనే లోకేష్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అమిత్ షా ను కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా పవన్ నోట సైతం అమిత్ షా కు ఫిర్యాదు చేయనున్నట్లు వచ్చింది. ఇప్పుడు లోకేష్ చర్యలు అలాగే ఉండడంతో దీని వెనుక కథ ఏమిటా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే అందరి వేళ్ళు రామోజీరావు వైపే చూపిస్తున్నాయి.
తొలుత ఈ మాస్టర్ ప్లాన్ చంద్రబాబుదేనని అంతా భావించారు. జైలు నుంచే చంద్రబాబు డైరెక్షన్ ఇస్తున్నారని టాక్ నడిపించారు. అయితే ఈ ప్లాన్ మొత్తం రామోజీ ఫిలిం సిటీ నుంచే రూపొందించారని తెలియడం విశేషం. ప్రస్తుతం జగన్ పతనాన్ని కోరుకోవడంలో రామోజీ ముందు వరుసలో ఉన్నారు. చంద్రబాబు కంటే మించి జగన్ నాశనాన్ని కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా ఒక ఉద్యమమే చేపడుతున్నారు. చంద్రబాబును ఎలా బయటకు తీసుకురావాలి? ప్రజల్లో సానుభూతిని ఎలా పెంచాలి? నిరసనలు, ఆందోళనలు ఎలా నిర్వహించాలి? అని పథక రచన చేస్తున్నారు.
జగన్ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో పవన్ ఉన్నారు. అదే ఇప్పుడు రామోజీకి పెట్టుబడిగా మారింది. పవన్ ముందు పెట్టి.. బిజెపిని దారిలో తెచ్చుకొని.. జగన్ పై గట్టి బాణాన్ని వదలాలని రాజ గురువు భావిస్తున్నారు. జనాలను జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించడం అన్న కాన్సెప్ట్ తోనే పక్కా వ్యూహాన్ని రచించారు. పొత్తుల ప్రకటన చేసిన మరుక్షణమే.. ఉమ్మడి కార్యాచరణ అమల్లోకి వస్తుందని చెప్పించడం ఒక్క రామోజీ కే సాధ్యం. ఫిలిం సిటీ నుంచి వచ్చిన డైరెక్షన్ తోనే యుద్ధం ప్రారంభమైంది. హస్తినాకు పాకింది. అక్కడ నుంచే గురిపెట్టి జగన్ ను కొట్టేందుకు రాజ గురువు పకడ్బందీ ప్లాన్ తన అమ్ముల పొదిలో ఉంచుకున్నారు. ఇక యుద్ధం ఎటువంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
