Ramoji Rao: అదంతే… రామోజీరావు కళ్ళకు ఏపీ మాత్రమే కనపడుతుంది
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనితీరులో లోపాలు ఉండవచ్చు గాక.. విధానపరమైన నిర్ణయాలలో తప్పులు ఉండవచ్చు గాక.. ఆయన ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తూ ఉండవచ్చు గాక..

Ramoji Rao: బియ్యం ధర కిలోకు 55 రూపాయలకు చేరుకుంది. ఉల్లిపాయ దాదాపు హాఫ్ సెంచరీకి చేరువలో ఉంది. కూరగాయల ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.. ఇవి కొనకుండా పూట కడవదు. పోనీ ధరలు తగ్గుతాయా అంటే అది ఎవరి చేతుల్లోనూ లేదు. కేవలం ఇది ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితమైన సమస్య కాదు. దేశం మొత్తం ఇలానే ఉంది. వర్షాభావ పరిస్థితులు, పంట ఉత్పత్తి ఆశించినంత మేర ఉండకపోవడం, వ్యాపారుల సిండికేట్.. పర్యవసానంగా ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితం అతలాకుతలమవుతోంది.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు దీనిని ఈ ఒక్క రాష్ట్రానికో ఆపాదించకూడదు. అలా చేస్తే అది పద్ధతి అనిపించుకోదు. కానీ ఈనాడు రామోజీరావుకు ఇదంతా కనిపించలేదు.. ఏకంగా ఈ ధరల పెరుగుదలకు జగన్ మోహన్ రెడ్డి కారణం అని ఆయన తేల్చేశాడు.
అలా ఎలా రాస్తారు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనితీరులో లోపాలు ఉండవచ్చు గాక.. విధానపరమైన నిర్ణయాలలో తప్పులు ఉండవచ్చు గాక.. ఆయన ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తూ ఉండవచ్చు గాక.. వీటన్నింటినీ బయటపెట్టే క్రమంలో కొంచెం లిబర్టీ తీసుకున్న పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే ప్రజా సమస్యలపై కథనాలు రాస్తున్నప్పుడు మీడియాకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉండాలి. కానీ ఆ పరిధి దాటిపోయి అడ్డగోలుగా రాస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. జనానికి మీడియా అంటే ఏవగింపు కలుగుతుంది. ప్రస్తుతం ఈనాడు చేస్తోంది కూడా అదే. ఈరోజు ఉదయం ఏపీ ఎడిషన్ లో ధరల పెరుగుదలకు సంబంధించి ఈనాడు ఒక బ్యానర్ వార్త రాసింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ధరలు ఎలా పెరిగాయో ఒక పట్టిక రూపంలో ఇచ్చింది. వాస్తవానికి ఏపీలో పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం పన్నులు విధిస్తుండడం వల్ల ఈ ప్రభావం నిత్యావసరాల మీద పడుతోందని ఈనాడు వాదిస్తోంది. అయితే కేవలం ఏపీలో మాత్రమే ఆ పరిస్థితి లేదు. పెట్రో ధరలు సెంచరీ మార్కు దాటిన తర్వాత.. ఆ ప్రభావం అన్ని రంగాల మీద తీవ్రంగా పడుతోంది. అయితే ఏపీలో ఎగుమతి చేసుకునే వస్తువులతో పాటు దిగుమతి తీసుకునే వస్తువులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పెట్రో ధరల ప్రభావం వాటిపై కూడా పడుతుంది. ఆ భారాన్ని అంతిమంగా మోయాల్సింది వినియోగదారుడే. కానీ ఈ సూక్ష్మ విషయాన్ని గ్రహించలేక రామోజీరావు జగన్ మీద అడ్డగోలుగా వార్త రాశాడు. ఇక్కడ రామోజీరావు మర్చిపోయిన విషయం ఏంటంటే.. ఏపీ కంటే తెలంగాణలోనే నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్నాయి. ఇదేదో గాలికి పోయే పొల్లు మాట కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం గణాంకాల జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
అక్కడ మాత్రం రాయదు
తెలంగాణలో ధరలు పెరుగుతున్న విషయాన్ని విస్మరించిన ఈనాడు.. ఏపీలో మాత్రమే ఘోరం జరిగిపోతుందని.. ఈ ధరల పెరుగుదలకు మాత్రమే కారణమని రాసుకుంటూ వచ్చింది. అంతకు ముందు ఉన్న ధరలను పట్టించుకోకుండా కేవలం 2019 నుంచి ఉన్న గణాంకాలు మాత్రమే రాసుకుంటూ వచ్చింది. బాబు పరిపాలన కాలంలో పెట్రోల్ ధరల మీద విధించిన పన్ను లను రాయకుండా ఈనాడు చాలా జాగ్రత్త పడింది. అంతేకాదు నాడు అన్ని అత్యంత చవక ధరలో ఉన్నాయని రాసేసింది. కానీ వాస్తవానికి దేశం మొత్తం ధరల పెరుగుదల తీవ్రంగా ఉంది. ఇందుకు అనేక పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ విస్మరించి కేవలం జగన్ మాత్రమే ఈ పాపానికి కారణమని ఈనాడు రాయడం దాని దిగజారుడు స్థాయి జర్నలిజానికి అద్దం పడుతుంది. గత కొద్ది రోజులుగా రామోజీరావు వ్యాపార సంస్థల్లో జరుగుతున్న సోదాలను దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఈ కథనం రాసిందని అర్థమవుతోంది. ధరల పెరుగుదల కూడా తెలంగాణలో అధికంగా ఉంది. అక్కడ మాత్రం ఒక్క ముక్క కూడా ఈనాడు రాయలేదు. ఒకవేళ ఇదే తీరుగా రాస్తే ఈనాడు అక్కడ బతికి బట్ట కట్టదు.
