Raja Singh : బీఆర్ఎస్ లోకి రాజాసింగ్..? హరీశ్‌తో భేటీ.. అసలు ట్విస్ట్ ఇదే
హరీశ్‌రావుతో భేటీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాజాసింగ్ స్పందించారు. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం మాత్రమే తాను హరీశ్‌ను కలిశానని తెలిపారు.

Raja Singh : తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొన్నటి వరకు బీఆర్‌ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అనుకున్నాయి. ఇప్పుడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధం కొనసాగిస్తున్నాయి. అందరి లక్ష్యం ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే. ఇక మూడు పార్టీల్లోని అసంతృప్త నేతలు పార్టీల మార్పుపై ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. అదును చూసుకుని కండువాలు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మంత్రి హరీశ్‌రావుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆయన ఏది చేసినా సంచలనమే..
గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ ఏది చేసినా ఓ సంచలనమే. కొంతకాలంగా ఆయన సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడప్పుడు తనదైన శైలితో చేస్తున్న కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలోని కొంతమంది ఇతర పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం ఊపందుకుంది. ఆ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా తరుణంలోనే మంత్రి హరీశ్‌రావును రాజాసింగ్ కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ మారతారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.. అన్న చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌కు మరో అస్త్రం..
ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ మీటింగ్‌గా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ మంత్రి హరీశ్‌రావుతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం లేనిది ఎన్నికల ముందు ఒక్కసారిగా కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడుతున్నారని ప్రచారం ఊపు అందుకున్న తరుణంలో రాజాసింగ్, హరీశ్‌రావుల భేటీ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ప్రాణం పోయే వరకూ బీజేపీలోనే..
హరీశ్‌రావుతో భేటీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాజాసింగ్ స్పందించారు. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం మాత్రమే తాను హరీశ్‌ను కలిశానని తెలిపారు. కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో ఉంటే బీజేపీలోనే ఉంటానని, లేదంటే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని స్పష్టం చేశారు. ప్రాణం పోయే వరకూ బీజేపీని వీడనని తెలిపారు. బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయకుండే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు.
