Puneeth Rajkumar: మరణం ఎంత విచిత్రమైనది.. ముక్కుపచ్చలారని బాలలను.. పండు ముదుసలిని..నడివయసుపు యవ్వనులను అది కబళించేస్తుంది. కాదెవరు మృత్యువుకు అడ్డు అన్నట్టుగా తయారైంది. తాజాగా మంచి బాడీ ఫిట్ నెస్ మెయింటేన్ చేసే పునీత్ రాజ్ కుమార్ ఎక్సర్ సైజ్ చేస్తూ గుండెపోటుతో మరణించడం విషాదాన్ని నింపింది.అంత ఫిట్ గా ఉండే పునీత్ కు గుండెపోటు రావడం.. ఒక్కసారిగా మరణించడం ఆయన అభిమానులను ఇప్పటికీ కలవరపరుస్తోంది. దీంతో జీవితం ఎప్పుడు ఎటు వైపు తిరుగుతుందో చెప్పలేమని.. ఆ దేవుడు ఆడే ఆటలో మన పావులు మాత్రమేనన్న నిజం లోకానికి అర్థమైంది.
ఈనెల 29న పునీత్ రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచాడు. పునీత్ మరణంతో శాండల్ వుడ్ శోకసంద్రమైంది. యావత్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకొని పలువురు నటీనటులు విలపించారు.
ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ మరణానికి కారణం ఏంటి? ఆయన మరణానికి ముందు ఏం చేశాడు? ఇప్పుడా వీడియోలు బయటకు వస్తున్నాయి.
పునీత్ చనిపోవడానికి ముందు రోజు గురువారం రాత్రి సంగీత దర్శకుడు గురుకిరణ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాడు. ఆ వీడియోలో చాలా సరదాగా పాటలు పాడుతూ హీరో, హీరోయిన్ల మధ్య పునీత్ సందడి చేశాడు. ఎంతో ఆరోగ్యంగా కనిపించాడు. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని షేర్ చేస్తూ అభిమానులు కంటతడి పెడుతున్నారు.
పునీత్ రాజ్ కుమార్ బెంగలూరులో సంగీత దర్శకుడు తన బర్త్ డే వేడుకలో దాదాపు 2 గంటల పాటు సందడిగా గడిపాడని గురు కిరణ్ తెలిపాడు. ఆయన చాలా ఆరోగ్యంగా.. సంతోషంగా ఉన్నాడని.. మాతో చాలా ఉత్సాహంగా గడిపాడని వివరించాడు. ఈ పార్టీలో పునీత్ తోపాటు నటుడు అనిరుద్, ఉపేంద్ర, హీరోలు, హీరోయిన్లు పాల్గొన్నారు. అందరినీ పలకరిస్తూ పునీత్ ఉత్సాహంగా గడిపాడు.
పునీత్ చివరి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన లేడు అన్న వార్త విషాదం నింపుతోంది. జీవితం అనూహ్యమైనది.. ఎప్పుడు ఎవరిని కబళిస్తోందో తెలియదని పలువురు కామెంట్ చేస్తున్నారు.