Khammam To Vijayawada Highway: కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా కేంద్రం మాకు ఏమీ ఇవ్వడం లేదని చెప్పేవాళ్లే. సందు దొరికితే కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలని చూసేవాళ్లే.. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. కేంద్రం ఇచ్చినా తీసుకునే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదు. ముఖ్యంగా జాతీయ రహదారుల విషయంలో కేంద్రం మంజూరు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారుతున్నది. ఇందుకు ఈ సంఘటనే ఇందుకు ఒక ఉదాహరణ. ఆయన ఓ కీలక ప్రజా ప్రతినిధి. రాష్ట్రంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న ఒక నేతకు దగ్గర మనిషి. ఖమ్మం జిల్లాలో ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది.. అలాంటి ప్రజా ప్రతినిధి తనకు సంబంధించిన వాళ్ళ భూములు పోతున్న నేపథ్యంలో ఏకంగా హైవే నే అడ్డుకున్నాడు. ఖమ్మం విజయవాడ జాతీయ రహదారికి మోకాలు అడ్డుపెట్టాడు. ఖమ్మం శివారులో అలైన్మెంట్ మార్చాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈయన గారి తతంగం వల్ల ఇప్పటికే ఒకసారి హైవే రద్దయి మళ్ళీ మంజూరు అయింది. ఈసారి కూడా రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనికి తోడు భూ సేకరణ కూడా నిలిచిపోయింది.. ఫలితంగా 1800 కోట్ల ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

Khammam To Vijayawada Highway
90 కిలోమీటర్ల హైవే
ఖమ్మం నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దీనికి కేంద్రం 1,800 కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డు ఖమ్మంలో 60 కిలోమీటర్లు, విజయవాడలో 30 కిలోమీటర్లు ఉంటుంది.. ఒకవేళ ఇది పూర్తయితే ఖమ్మం నుంచి విజయవాడకు 80 నిమిషాలోనే చేరుకోవచ్చు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రెండు విడతల్లో భూసేకరణ కూడా పూర్తయింది. ఈ మూడో విడత భూసేకరణకు ఖమ్మం శివారు ప్రాంతంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. దీనివల్ల మొత్తం హైవే నిర్మాణంలోనే ప్రతిష్టంబన ఏర్పడుతోంది. పనులు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే ఒకసారి రద్దయి వచ్చిన హైవే మళ్లీ రద్దు అవుతుందా? అనే ఆందోళన ఖమ్మం వాసుల్లో వ్యక్తం అవుతున్నది. జిల్లాలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీకి చెందిన కీలక నేత ఈ భూ సేకరణకు అడ్డుపడుతున్నాడు. తన, తన బినామీలకు సంబంధించిన భూముల నుంచి వెళ్లే హైవే అలైన్మెంట్ మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడు.. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఖమ్మం మీదుగా ఐదు జాతీయ రహదారులు మంజూరయ్యాయి.. అవి ఎన్.హెచ్ 365 బీ జీ పేరు తో సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 60 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి కోదాడ (ఎన్ హెచ్ 365a ) వరకు 40 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి దేవరపల్లి కి ఎన్ హెచ్ 365 బిజీ గ్రీన్ ఫీల్డ్ హైవే 168 కిలోమీటర్లు, వరంగల్ నుంచి ఖమ్మం ఎన్హెచ్163 జి 108 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి విజయవాడ ఎన్ హెచ్ 163 జి వరకు 90 కిలోమీటర్ల మేర రహదారులు మంజూరయ్యాయి. వీటిల్లో కొన్ని రహదారుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఖమ్మం విజయవాడ హైవేకు గతంలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కారణాలతో అది రద్దయింది.. అయితే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి చొరవ తీసుకోవడంతో భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా కేంద్రం మళ్లీ అంగీకారం తెలిపింది.
ఇక్కడే ముసలం మొదలైంది..
ఈ హైవే ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుసంధానం అవుతుంది. ఖమ్మంలో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ సమీపం నుంచే ఈ హైవేను ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో హైవేకు, కలెక్టరేట్ కు అనుసంధాన రోడ్డు నిర్మించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది.. ఇప్పుడు ఈ జాతీయ రహదారి రాజకీయ చక్రబంధంలో చిక్కుకుంది. ఈ హైవే కారణంగా ఖమ్మం శివారులో అధికార పార్టీలో కీలక నేతకు చెందిన అనుచరుల భూములు భూ సేకరణలో పోనున్నాయి.

Khammam To Vijayawada Highway
హైవే నిర్మాణానికి మొత్తం మూడు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది.. ఇప్పటికే రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటి ప్రకారం భూ సేకరణ కూడా పూర్తి చేశారు. మూడో గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఖమ్మం శివారు ప్రాంతాల్లో భూమిని సేకరించాల్సి ఉంది. అయితే ఆ కీలక నేత మోకాలు అడ్డుపెడుతుండటంతో భూ సేకరణ, నోటిఫికేషన్ నిలిచిపోయినట్టు తెలుస్తోంది.. అలైన్మెంట్ మార్చాలంటూ సదరు నేత అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించకపోతే మొత్తం ప్రాజెక్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఖమ్మం నుంచి కోదాడకు హైవే ఉండటం, కోదాడ నుంచి విజయవాడకు నేషనల్ హైవే ఉండటమే కారణంగా చెబుతున్నారు. అయితే ఈ హైవే వల్ల ఖమ్మం రూపు రేఖలే మారిపోతాయి. భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఇంతటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ… రోడ్డుకు సదరు నేత ఎర్రజెండా చూపడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నది.