Prince Harry: వేల ఏళ్ల రాజ కుటుంబం..”స్పేర్” పార్ట్స్ లెక్కన ఇజ్జత్ పోగొట్టుకుంది
హ్యారీ ” స్పేర్” పేరుతో ఒక పుస్తకం రాశాడు.. రాజభవనంలో వర్ణ వివక్షత ఎలా ఉంటుందో ఉదాహరణలతో చెప్పాడు.. తనకంటే వయసులో పెద్దదైన మహిళతో జరిపిన శృంగారాన్ని కూడా అందులో రాసుకొచ్చాడు.

Prince Harry: ” ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?
ఏ రాజ్యం ఎన్నాళ్లు ఉందో?
తారీఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకు అర్థం
ఈ రాజు ప్రేమ పురాణం
పట్టాభిషేకానికైన ఖర్చులు
పూసిన అత్తర్లు, కైఫియతులూ ఇవే కదా ఇప్పటి చరిత్ర సారం
రవి అస్తమించని చీకటికోణం
అట్టడుగున పడిన డయానా మరణం
ఆ కథలన్నీ “స్పేర్” పార్ట్స్ లాగా లభిస్తున్నాయిప్పుడు”
ఇదీ చరిత్ర
పై ఉపోద్ఘాతం మొత్తం బ్రిటన్ రాజకుటుంబం గురించే.. వాస్తవానికి బ్రిటన్ రాజు చార్లెస్ కు డయానాతో పెళ్లయింది. ఆమె ద్వారా అతడికి విలియమ్స్, హ్యారీ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. అయితే ఈ చార్లెస్ అనే వ్యక్తి రాజకుటుంబంలో పుట్టినప్పటికీ బుద్ధులన్నీ వక్రమార్గంలో ఉండేవి. డయానాను పెళ్లి చేసుకునే కంటే ముందు చార్లెస్ కెమిల్లా అనే మహిళతో సంబంధం నెరిపాడు. అంతేకాదు ఆమె కోసం ఏకంగా డయానాకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కెమిల్లాతో కలిసి ఉండడం మొదలుపెట్టాడు. వాస్తవానికి కెమిల్లాకు కూడా గతంలో వివాహమైంది. అయితే చార్లెస్ కోసం ఆమె విడాకులు తీసుకుంది.. విడాకుల అనంతరం డయానా రాజమహల్ నుంచి దూరంగా వెళ్లిపోయింది.. అనుకోని రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు.
అప్పటి నుంచే హ్యారీ కి కోపం
అయితే చార్లెస్, డయానా దంపతుల చిన్న కొడుకు హ్యారీ బాహుబలి సినిమాలో ప్రభాస్ టైపు. రాజ కుటుంబం పోకడలు అంటే నచ్చేవాడు కాదు. పైగా తన తల్లి మృతి చెందినప్పుడు తన తండ్రి చార్లెస్ దగ్గరికి పోవడం అతనిలో కోపాన్ని పెంచింది. తల్లి చనిపోయిన తర్వాత ఆమె స్థానంలోకి కెమిల్లా రావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. చివరికి తనకంటే రెండేళ్లు పెద్దదైన అమెరికా దేశానికి చెందిన మేఘన్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుంటే రాజరికం హోదా రద్దవుతుందని తెలిసినప్పటికీ అతడు ప్రేమకే తలవంచాడు. అయితే అతడు ప్రేమ వివాహం చేసుకోవడం రాజ కుటుంబానికి అస్సలు ఇష్టం లేదు. పైగా మేఘన్ చామన చాయతో ఉండడం వల్ల రాజకుటుంబం ఆమె వర్ణాన్ని ఎగతాళి చేసింది. అంతేకాదు ఆమెకు విడాకులు ఇవ్వాలని కూడా కోరింది. చార్లెస్ మొదటి కొడుకు విలియమ్స్ అయితే హ్యారీని కొట్టాడు కూడా. ఇక ఈ అవమానాలు భరించలేక హ్యారీ రాజ భవనం నుంచి బయటికి వెళ్లిపోయాడు. అమెరికాలో తన భార్యతో కలిసి ఉంటున్నాడు.
పుస్తకం రాశాడు
తనకు ఎదురైన అవమానాలను హ్యారీ ” స్పేర్” పేరుతో ఒక పుస్తకం రాశాడు.. రాజభవనంలో వర్ణ వివక్షత ఎలా ఉంటుందో ఉదాహరణలతో చెప్పాడు.. తనకంటే వయసులో పెద్దదైన మహిళతో జరిపిన శృంగారాన్ని కూడా అందులో రాసుకొచ్చాడు.. తాను రాజ కుటుంబం నుంచి బయటికి వెళ్లినప్పుడు క్వీన్ ఎలిజబెత్ ఎలా స్పందించాలో కూడా హ్యారీ వివరించాడు.. అయితే ఈ స్పేర్ పుస్తకం ఇప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలకు కేంద్ర బిందువు అవుతూనే ఉంది. ఇటీవల చార్లెస్ పట్టాభిషేకం కార్యక్రమం సందర్భంగా ఈ పుస్తకం ప్రస్తావన మరొకసారి తెరపైకి వచ్చింది. తాజాగా మంగళవారం న్యూయార్క్ లో ఒక అవార్డుల ఫంక్షన్ కు హ్యారీ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఫోటో జర్నలిస్టులు అతని వెంట పడ్డారు. రాజకుటుంబంతో ఏర్పడిన విభేదాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.. అయితే ఆ జర్నలిస్టుల నుంచి హ్యారీ తప్పించుకున్నాడు..దీనిని అతడు పాపరజ్జీ గా అభివర్ణించాడు. ఇలాంటి వారి వల్లే తన తల్లి కన్ను మూసిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ నేపథ్యంలో హ్యారీ మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. అంతేకాదు పైకి బంగారు సింహాసనంలో రాజు ఊరేగుతున్నప్పటికీ కనిపించని మరకలు ఎన్నో ఉన్నాయని హ్యారీ తన పుస్తకం ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేశాడు. అందుకే అంటారు రాజుల సొమ్ము రాళ్లపాలు.. వారి కీర్తి కండుతి వ్యవహారం మట్టిపాలు అని.
