PM Modi Vote: నరేంద్ర మోడీ… అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రి. ప్రపంచంలోనే సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అటువంటి అతను తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి… ఓటు హక్కు వినియోగించుకున్నారు. అది కూడా అది సామాన్యమైన వ్యక్తి లా క్యూ లో నిలబడి… అహ్మదాబాద్ లో రాణిప్ లో గల పోలింగ్ కేంద్రం లో ప్రధాని ఓటేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం గాంధీనగర్ రాజ్ భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు.. అక్కడి నుంచి రాణిప్ లోని నిషాన్ పబ్లిక్ స్కూల్ కు వచ్చి కాన్వాయ్ ని కొంత దూరంలో ఆపి పోలింగ్ కేంద్రం వద్దకు నడుచుకుంటూ వెళ్లారు.. ప్రధానమంత్రిని చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు.. వారికి అభివాదం చేసుకుంటూ నరేంద్ర మోడీ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు.. సామాన్య ప్రజలతో కలిసి క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా గుజరాత్ ప్రజలను కోరారు.

PM Modi Vote
చాలామంది ప్రముఖులు ఓటేశారు
ప్రధాని నరేంద్ర మోడీనే కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.. శైలజ్ అనుపమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ లో రెండో విడత పోలింగ్ లో భాగంగా ప్రజలు సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు 12 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
రెండో విడతలో ఇలా..
185 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ జరుగుతున్నది.. మొదటి విడత పోలింగ్ ఇప్పటికే పూర్తయింది.. రెండో విడత పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా 14 జిల్లాల్లో 93 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.51 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది..5:30 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవుతాయి.

PM Modi
పోరు హోరాహోరీ
ఈసారి ఆప్ రంగంలోకి దిగడంతో పోటీ హోరాహోరీగా ఉన్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొదటి దశలో జరిగిన పోలింగ్లో బిజెపి కాస్త పై చేయి సాధించినట్లు తెలుస్తోంది. అయితే రెండో దశలో కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతున్నది. అయితే ఎన్నికలకు ముందు కీలక నాయకులు బీజేపీ కండువా కప్పుకోవడంతో ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆప్ ప్ర వేశం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలుతుందని కాంగ్రెస్ భయపడుతున్నది.