SI Pre Wedding Shoot: పీఎస్ లో ప్రీ వెడ్డింగ్ షూట్.. సీపీ షాకింగ్ రియాక్షన్!
అయితే ఈ వివాదంపై తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘‘నేను దీనికి మిశ్రమ స్పందనలను చూశాను. నిజాయితీగా చెప్పాలంటే.. వారు వివాహం చేసుకోబోతున్న ఆనందంలో ఎక్కువగా ఉద్వేగభరితంగా ఉన్నారు.

SI Pre Wedding Shoot: తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఇద్దరు యువ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వారి ప్రీ వెడ్డింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన కొన్ని దృశ్యాలను చిత్రీకరించడం, అంతేకాకుండా పోలీసు వాహనాలను వినియోగించడం, పోలీసు యూనిఫామ్‌తోనే షూట్‌లో కొన్ని సీన్లు ఉండటంపై పలువురు నెటిజన్లు ఆ జంటపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు దంపతులు వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారని కొందరు, ఇద్దరు పోలీసులు ఒక్కటయ్యారని ఇందులో తప్పేముందని మరికొందరు అంటున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్సై కె భావనతో అదే స్టేషన్ లోని ఆర్మ్‌డ్ రిజర్వ్ ఎసై అయిన రావూరి కిషోర్‌తో ఆగస్టు 26న వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోలో.. తొలి కొన్ని సన్నివేశాలను పంజాగుట్ట పోలీసు స్టేషన్ ఆవరణలో చిత్రీకరించడం, పోలీసు వాహనాలను వినియోగించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
స్పందించిన సీపీ..
అయితే ఈ వివాదంపై తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘‘నేను దీనికి మిశ్రమ స్పందనలను చూశాను. నిజాయితీగా చెప్పాలంటే.. వారు వివాహం చేసుకోబోతున్న ఆనందంలో ఎక్కువగా ఉద్వేగభరితంగా ఉన్నారు. అది గొప్ప వార్త.. అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. పోలీసింగ్ అనేది చాలా కఠినమైన పని.. ముఖ్యంగా మహిళలకు మరింత కష్టం. ఆమె తన డిపార్ట్‌మెంట్‌లో జీవిత భాగస్వామిని కనుగొనడం మనమందరం సంతోషించాల్సిన విషయమే. ఇద్దరు పోలీసు అధికారులే.. వారు పోలీసు డిపార్ట్‌మెంట్ ఆస్తులు, చిహ్నాలను ఉపయోగించడంలో నేను తప్పును కనుగొనలేదు. వారు మాకు ముందే తెలియజేసి ఉంటే మేము కచ్చితంగా షూట్‌కి సమ్మతి తెలిపి ఉండేవాళ్లం. మనలో కొందరికి ఆగ్రహావేశాలు కలగవచ్చు. కానీ వారి పెళ్లికి నన్ను పిలవనప్పటికీ.. వారిని కలుసుకుని ఆశీర్వదించాలని భావిస్తున్నాను. అయితే సరైన అనుమతి లేకుండా దీన్ని పునరావృతం చేయవద్దని నేను ఇతరులకు సలహా ఇస్తున్నాను’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
