Electricity Meters : ఒక రైతు బిడ్డగా నీ గుండెలపై చేయి వేసుకొని చెప్పు.. అన్నం పెట్టే రైతన్నలకు కనీసం విద్యుత్ ను ఉచితంగా ఇవ్వలేవా? వారి వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టి మళ్లీ మునుపటి రోజులకు రైతుల ఆత్మహత్యలకు దారితీస్తారా? అన్న ఆవేదన రైతుల్లో నెలకొంది. కేంద్రం సంస్కరణలు.. జగన్ సర్కార్ అవగాహన లేని చర్యలు రైతుల్లో భయాందోళనకు కారణమవుతున్నాయి.
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టడాన్ని దేశంలోని కొన్ని రాష్ట్రాలు , రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యవసాయక కాముక దేశమైన మన భారత్ లో మనందరికీ అన్నం పెట్టే రైతన్నకు మనం, ప్రభుత్వాలు ఏమైనా చేయాలి. తెలంగాణలో, ఏపీలో ఉచితవిద్యుత్ వల్లే రైతుల జీవితాలు బాగుపడ్డాయి. కరెంట్ బిల్లుల బాధ లేకుండా.. ఆ ధరాఘాతానికి దూరంగా పంటలు పండించి కాసిన్ని డబ్బులు మిగల్చుకొని బాగుపడుతున్నారు. రైతుల కోణంలో ‘ఉచిత విద్యుత్’ అన్నది ఒక నిత్యావసరం.. ఖచ్చితం.. ఏ ప్రభుత్వం వచ్చినా అది చేయాల్సిందే..

కానీ ఇప్పుడు విద్యుత్ మీటర్లు.. వాటికి ప్రీపెయిడ్ బిల్లుల వల్ల రైతులకు శరాఘాతంగా మారనుంది. ప్రభుత్వాలు తామే బిల్లులు కడుతామన్నా కూడా అది నిర్వహణలో అసాధ్యం. రైతులు ఆ బిల్లులు చూసే సగం చస్తారు. ఇప్పటివరకూ హాయిగా గుండెలపై ‘విద్యుత్ బిల్లు’ లేకుండా వ్యవసాయం చేసుకున్న రైతులకు ఇప్పుడు ఈ విద్యుత్ మీటర్లు అనగానే కంగారు పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే వ్యవసాయ విద్యుత్ మీటర్లు పెట్టనని తెలంగాణ రైతులకు భరోసా కల్పించగా.. ఏపీ సీఎం జగన్ మాత్రం ఉచితంగా రైతులకు విద్యుత్ మీటర్లు మారుస్తానంటూ ఉచితంగానే రైతుల గొంతు కోస్తున్నాడని అక్కడి రైతులు విరుచుకుపడుతున్నారు.
రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వీలైనంత త్వరగా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు పెట్టేందుకు సీఎం జగన్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే 16,63,705 మంది రైతులు ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు. రైతులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లు బిగిస్తాయని.. దీని వల్ల రైతులకు ఎంత కరెంట్ అవసరమో తెలుస్తుందని జగన్ సర్కార్ చెబుతోంది. ఆ వినియోగించుకున్న విద్యుత్ కు అయ్యే ఖర్చులను జగన్ సర్కార్ రైతుల ఖాతాల్లోకి వేస్తుందట.. అక్కడి నుంచి డబ్బు విద్యుత్ పంపిణీ సంస్థలకు చేరుతుందట..
ఇలా రైతు తప్పనిసరిగా విద్యుత్ వాడుకుంటే కట్టాలి. వాటిని ప్రభుత్వం ఇస్తే పంపిణీ సంస్థలకు జమ చేయలి. ప్రభుత్వాలు ఇవ్వకుంటే మాత్రం రైతుల మెడకు ఈ విద్యుత్ తీగలతో ఉరివేసినట్టే. ఎందుకంటే వ్యసాయానికి త్రీ ఫేజ్, 5 ఫేస్ విద్యుత్ అవసరం. దానికి ఇప్పటి రేట్లతో పోల్చితే వ్యవసాయ వ్యయం బాగా పెరుగుతుంది. రైతు పంట మొత్తం విద్యుత్ ఛార్జీలకే సగం పోతుంది. సో ఈ మీటర్ల పథకంపై రైతుల్లో ఆందోళన ఉంది. జగన్ సర్కార్ ఉచితం పేరుతో వారి గొంతు కోస్తోందని రైతులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యుత్ మీటర్ల వాడకంపై వారికి అవగాహన కల్పిస్తారా? లేదా వదిలేస్తారా? అన్నది వేచిచూడాలి.