YCP : ఏపీలో ఆ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మాట తప్పం మడప తిప్పం అని చెప్పి.. ఇప్పుడు తప్పడంతో జనంలో నిట్టూర్పు మొదలవుతోంది. జాతీయ సర్వే సంస్థ ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. సొంత సర్వే సంస్థ ఫలితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయని తెలుస్తోంది.

ఏపీలో జగన్ తిరుగులేని మెజార్టీ సాధించారు. 50 శాతానికి పైగా ఓట్లు కొల్లగొట్టారు. జనం జేజేలు పలికారు. దీని వెనుక జగన్ హామీలు ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ హామీలను జగన్ మరిచిపోయాడు. అరకొరగా అమలు చేశాడు. దీంతో జనంలో వ్యతిరేకత మొదలైంది. ఈ విషయాన్ని ఇండియా టుడే సంస్థ వెల్లడించింది. గతంలో అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రిగా ఇండియా టుడే ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ ర్యాంకును తగ్గిస్తూ సర్వేని వెల్లడించింది. జగన్ కు కేవలం 39 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారని సర్వేలో తేలింది. జగన్ సీఎంల జాబితాలో చిట్టచివర ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాదిలోనే 20 శాతం ప్రజాభిప్రాయం నెగిటివ్ గా మారింది.
ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ తో జగన్ ఒప్పందం చేసుకున్నారు. ఐప్యాక్ ఏపీ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్, సంక్షేమ పథకాల పై ప్రజాభిప్రాయం.. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహిస్తోంది. ఐప్యాక్ సర్వేలో 80 శాతం మంత్రులు ఓడిపోతారని తేలిందని సోషల్ మీడియాలో ఓ సర్వే హల్ చల్ చేస్తోంది. మొదటి క్యాబినెట్ లో ఉన్న కొడాలి నాని, ధర్మానప్రసాద్ రావు, రెండో క్యాబినెట్ లో ఉన్న పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, డిప్యూటీసీఎం నారాయణస్వామి, డిప్యూటీసీఎం అంజద్ బాషా తప్ప మిగిలిన మంత్రులందరూ ఓడిపోతారని సర్వేలో వెల్లడైనట్టు తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో తీవ్రంగా విఫలమైంది. సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి.. దాని లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. కేవలం అప్పులతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. జీతాలు సరైన సమయానికి ఇవ్వడం లేదంటే ఏపీ ఆర్థిక పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పైనే నమ్మకం పెట్టుకుంది. పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని నమ్ముతోంది. కానీ సర్వేల్లో మాత్రం విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వం పై రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. రైతులకు మేలు చేకూరే పథకాలు ఒక్కటీ లేవంటూ జనం ఆరోపిస్తున్నారు.
వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని నమ్ముకునే ప్రభుత్వం పాలన చేస్తోంది. పథకాలు ఏ మేరకు ఇచ్చామనడం కంటే.. ఆ పథకాలు లబ్ధిదారున్ని ఏ మేరకు సంతృప్తిపరిచాయి అన్న అంశం కూడా కీలకం. లబ్ధిదారులు ఓటర్లుగా మారాలంటే వారు సంతృప్తి చెందాలి. కానీ లబ్ధిదారుల్లో మిశ్రమ స్పందన ఉంది. కేవలం జగన్ కే ఓటు వేస్తామన్న పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదు. మరి జగన్ ఏ మేరకు దీనిని అధిగమించి మళ్లీ అధికారంలోకి వస్తారో వేచిచూడాలి.