Pawan vs Vasireddy Padma: ఏపీలో మహిళలకు రక్షణ కరువైంది. ఆడపిల్ల అడుగు బయట పెట్టిన నాటి నుంచి ఇంటికి చేరేవరకూ తల్లిదండ్రులకు ఒకరకమైన టెన్షన్. మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. 18 నెలల చిన్నారి నుంచి ఆరు పదుల వృద్ధుల వరకూ అందరూ బాధితులే. 14 ఏళ్ల బాలుడు నుంచి ఎనిమిది పదుల వృద్దులు నిందితులుగా వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జగన్ సర్కారు మాత్రం దిశ చట్టాన్ని అమలుచేస్తున్నాం. ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేశాం. ఘటన జరిగిన మూడు వారాల్లో నిందితులకు శిక్షలు అమలుచేస్తున్నామని ప్రకటనలకు పరిమితమవుతోంది. సీఎం నివాసం సమీపంలో జరిగిన గ్యాంగ్ రేప్, హోంమంత్రి ఇలాకాలో జరిగిన అఘాయిత్యాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు. దీనిపై విపక్షాలు పోరాడుతుంటే అవి రాజకీయ రాద్దాంతంగా రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటనలు ఇస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో నెలకొంది.

ఏపీలో లైంగిక నేరస్తుల సంఖ్య 2 లక్షలకు మించిందని ఓ నివేదిక చెబుతుంటే.. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు ఏ స్థాయిలో రక్షణ ఉందో అర్ధంచేసుకోవచ్చు. అయితే మహిళలు, బాలలపై అకృత్యాలను నియంత్రించాల్సిన ఏపీ మహిళా కమిషన్ అధికార వైసీపీ జేబు సంస్థలా మారిపోయింది. ఎంతలా అంటే మహిళలకు రక్షణకు కల్పించాలని కోరినందుకు విపక్ష నాయకులకే నోటీసు అందించేలా. ప్రస్తుతం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ వ్యవహరిస్తున్నారు. బుగ్గ కారు, సెక్యూరిటీతో పాటు భారీగా వేతనం, కేబినెట్ హోదాతో దర్జాగా పదవిని అనుభవిస్తున్నారు. కానీ కష్టాలు అనుభవిస్తున్న మహిళలకు మాత్రం స్వాంతన చేకూర్చలేకపోతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జీతం ప్రాతిపదికన పనిచేసిన ఆమె కష్టాన్ని గుర్తించిన జగన్ మంచి హోదా కల్పించి పదవి చేతిలో పెట్టారు. అయితే ఆ పదవికి న్యాయం చేయడం వదిలి.. పదవి ఇచ్చిన జగన్ కు రాజకీయ లబ్థి చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన మహిళా కమిషన్ ను ఒక రాజకీయ సంస్థగా మార్చడంలో మాత్రం వాసిరెడ్డి పద్మ సక్సెస్ అయ్యారు.
ఆ మధ్యలో కీచక ఘటనకు సంబంధించి బాధితురాలికి టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. దానికి ప్రభుత్వం కౌంటర్ ఇవ్వాలేకానీ.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ అన్న విషయాన్ని మరిచిపోయి.. అసలు సిసలు వైసీపీ నాయకురాలిగా వాసిరెడ్డి పద్మ వ్యవహరించారు. ఏకంగా తనకున్న అధికారంతో చంద్రబాబుకే నోటీసులు ఇచ్చేశారు. దీనిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కు సైతం అదే మాదిరిగా నోటీసులిచ్చారు. విశాఖ ఘటనల నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితంపై పదే పదే కామెంట్స్ చేస్తున్న వైసీపీ నేతలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో తాను చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తరువాతే వివాహాలు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ నేతలు విడాకులు తీసుకోకుండా పెళ్లిళ్లు చేసుకోండి అంటూ సవాల్ చేశారు. అంతే మరుక్షణం స్పందించిన వాసిరెడ్డి పద్మ.. మహిళల మనోభావాలను పవన్ దెబ్బతీశారంటూ సుమోటాగా భావించి ఏకంగా నోటీసులు పంపించారు.
నోరు తెరిస్తే బూతులు మాట్లాడే నేతలు వైసీపీలో కోకొల్లలు. అటు లైంగిక వేధింపులు, మహిళలను వేధించే ఆడియోలు, వీడియోలు ఎన్నో బయటకు వచ్చాయి. అంతెందుకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అంబటి అత్రుత రంకెలు బయటకు వచ్చాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కోరికల చిట్టా బయటపడింది. ఇవేవీ సుమోటాగా తీసుకునేందుకు అర్హత పొందినవి కాదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 800 అకృత్యాలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనల బాధితులకు మహిళా కమిషన్ చూపించిన స్వాంతన ఉందా? అంటే అదీ లేదు. కేవలం రాజకీయ నిరుద్యోగ భర్తీకి వేదికగా మహిళా కమిషన్ మారిపోయింది. అందునా పార్టీలకు జీతాలకు పనిచేసే వాసిరెడ్డి పద్మలాంటి వారిని కమిషన్ లోకి తీసుకోవడం పై విమర్శలు రేగుతున్నాయి. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అమానుషాలపై నిత్యం పోరాడే ఎంతో మంది మహిళామణులు ఏపీలో ఉన్నారు. అటువంటి వారికి చైర్ పర్సన్ బాధ్యతలు అప్పగించుంటే పదవికి ఔన్నత్యాన్ని తీసుకొచ్చేవారు. కానీ జగన్ కు వారు రాజకీయంగా పనికి రారు. కాబట్టే పార్టీకి ఇతోధికంగా కష్టపడి వస్తున్న వాసిరెడ్డి పద్మలాంటి వారికి రాజకీయ ఉద్యోగం కల్పించారు.