Telangana Cabinet: కొలిక్కి వచ్చిన కూర్పు.. తెలంగాణ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.

గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రివర్గ ప్రముఖులతోనూ గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే అప్పటికి ఎవరికీ ఇంకా శాఖలు కేటాయించలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మంత్రివర్గ శాఖలు కేటాయింపు పూర్తయినట్టు ప్రచారం జరిగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 9, 2023 10:34 am

Telangana Cabinet

Follow us on

Telangana Cabinet: మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం లో బాధ్యతలు స్వీకరించే మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం హుటాహుటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో ఎవరెవరికి ఎటువంటి శాఖలు కేటాయించాలో రాత్రి పొద్దుపోయేదాకా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియలో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పెద్దలు పాల్గొన్నారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం.. భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ శాఖలు కేటాయింపు జరిగినట్టు తెలుస్తోంది.

రూమర్స్ కు చెక్ పెడుతూ

గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రివర్గ ప్రముఖులతోనూ గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే అప్పటికి ఎవరికీ ఇంకా శాఖలు కేటాయించలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మంత్రివర్గ శాఖలు కేటాయింపు పూర్తయినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. వెంటనే ఎవరికి మంత్రివర్గ శాఖల కేటాయించలేదని ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేయించారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం మొత్తం రూమర్ అని తేలిపోయింది. ఆ తర్వాత శుక్రవారం ప్రగతిభవన్ లో ప్రజాదర్బార్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లిపోయారు.

శాఖల కేటాయింపు ఇలా

రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన అనంతరం శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా మంత్రివర్గ కూర్పు పై కసరత్తు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖ కేటాయించారు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ కేటాయించారు. ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ కేటాయించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఉత్తంకుమార్ కు పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ కేటాయించారు. ఆందోల్ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహకు వైద్యారోగ్య శాఖ కేటాయించారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రోడ్డు భవనాల శాఖ కేటాయించారు. పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ కేటాయించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు అప్పగించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖ కేటాయించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు అటవీ శాఖ కేటాయించారు.. హోం శాఖ, రెవెన్యూ, విద్యుత్ , మైనార్టీ శాఖలకు ఇంకా మంత్రులను కేటాయించలేదు. ఈ మంత్రివర్గంలో కొన్ని జిల్లాలకు స్థానం దక్కని నేపథ్యంలో .. ఆ ప్రాంతాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి ఆ శాఖలను కేటాయించే అవకాశం ఉంది