Homeఆంధ్రప్రదేశ్‌Tirumala TTD: తిరుమలలో పరిస్థితులు చేజారిపోవడానికి కారుకులు ఎవరు?

Tirumala TTD: తిరుమలలో పరిస్థితులు చేజారిపోవడానికి కారుకులు ఎవరు?

Tirumala TTD: ‘వేంకటాద్రి సమంస్థానం.. బ్రహ్మాండే నాస్తి కించనం. వేంకటేశ సమోదేవో.. నభూతో న భవిష్యతి.. వేంకటాద్రి లాంటి క్షేత్రం’ ఈ బ్రహ్మాండంలోనే లేదు. వేంకటేశ్వరుడికి సాటి వచ్చే మరో దైవం కూడా లేదు. కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిపై భక్తులకు ఉండే నమ్మకం అపారమైనది.. శ్రీనివాసుడు అంటే ప్రతీ తెలుగు భక్తుడి సెంటిమెంట్‌.. తనివి తీరని ఆ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది భక్తులు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటారు. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంతో ఇప్పుడు స్వామి దర్శనం భక్తులకు కానకష్టమవుతోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో తిరుమలలో మంగళవారం సర్వదర్శనం టికెట్‌ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. శ్రీవారి భక్తులకు కనీస సౌకర్యాలు అందించడంలో టీటీడీ ఘోరంగా విఫలమవుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు.. తిరుమలలో భక్తుల ఇబ్బందులకు కారకులు ఎవరు? టీటీడీనా? లేక భక్తుల రద్దీనా? ఈ విషయం తప్పు ఎవరిదన్న దానిపై స్పెషల్ ఫోకస్..

తిరుపతిలో టీటీడీ మూడు చోట్ల సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తుంది. టీడీడీ రెండో సత్రం, భూదేవి కాంప్లెక్, శ్రీనివాసం వద్ద సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు. అయినా సర్వ దర్శనం టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల సంఖ్య ఆధారంగా టికెట్ల జారీ కేంద్రాలను పెంచాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంగళవారం మూడు కౌంటర్ల వద్ద గంటల తరబడి టికెట్ల కోసం ఎండలో నిరీక్షించిన భక్తులు సహనం కోల్పోయి ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది. వేలాంది మంది ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. భక్తులు గాయపడ్డారు. కొంతమంది సొమ్మసిల్లారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ వైఫల్యం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనబడిందని పలువురు పేర్కొంటున్నారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని, కనీసం తాగునీరు, నీడ సౌకర్యం కూడా కల్పించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేయడం అధికారులు, పాలకవర్గం పనితీరుకు అద్దం పడుతోంది. ఇంత జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్‌ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

-దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన టీటీడీ బోర్డు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట మసకబారిందని ప్రతిపక్ష బీజేపీ, టీడీపీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా శ్రీవారి భక్తులకు కనీస సౌకర్యాలు అందించడంలో టీటీడీ ఘోరంగా విఫలం కావడం వీరి ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. భక్తులు అధికంగా వచ్చినప్పుడు తోపులాట, తొక్కిసలాట ఆలయాల వద్ద జరుగడం సాధారణం. కానీ ఇతర ఆలయాలకు టీటీడీకి పోలిక ఉండదు. ఎందుకంటే తిరుమలకు ఎంతమంది వచ్చినా.. అందరికీ స్వామివారి దర్శనం కల్పించడం.. తొక్కిసలాట జరుగకుండా చర్యలు తీసుకోవడానికి టీటీడీ బోర్డు ఉంది. అయినా.. మంగళవారం ఇలాంటి పరిస్థితి రావడం విమర్శలకు తావిస్తోంది. సంస్కరణల పేరుతో విపరీతమైన మార్పులు చేయడం, హేతుబద్ధత లేకుండా నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

-ఆదాయ వనుగా చూడడమే అసలు సమస్య..
తిరుమలను అధికారులు, పాలకులు, పాలకవర్గం ఆదాయ వనరుగా చూడడమే అసలు సమస్యలకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే గొప్ప దివ్య క్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనం భక్తుల మనోభావాలకు సబంధించిన అంశం. దేవుడికి, భక్తులకు మధ్య అనుసంధానంగా ఉండాల్సిన అధికారులు ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలే ఇలాంటి తొక్కిసలాటకు కారణమన్న విమర్శలూ ఉన్నాయి.

-పరిపాలనా వైఫల్యమే..
తిరుమల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఆలయం. రోజుకు లక్ష మంది వచ్చినా దర్శనం చేసుకునే సౌకర్యాలు ఉన్నాయి. ఏయే రోజుల్లో భక్తులు ఎంతమంది వస్తారు.. రద్దీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది.. ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంచనాలు టీటీడీకి ఉంటాయి. మంగళవారం భారీగా భక్తులు రాకపోయినా తొక్కిసలాట జరుగడం పరిపాలనా వైఫల్యమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

-అంచనాలు తప్పాయి..
సాధారణంగా తిరుమలలో నిత్యం 20 వేల మందికి సుదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో 30 వేలు.. వారాంతాల్లో 40 వేల సుదర్శన టోకెన్లు జారీ చేస్తారు. అయితే అనాలోచితంగా రెండు రోజులుగా అధికారులు సర్వ దర్శనం టికెట్ల జారీ నిలిపివేశారు. దీంతో రెండు రోజుల నుంచి భక్తులు తిరుమలలోనే చిక్కుకు పోయారు. మంగళవారం టికెట్ల జారీ ప్రారంభించిన విషయం తెలుసుకున్న భక్తులంతా మూడు కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే సర్వ దర్శనం టికెట్ల కోసం భారీగా భక్తులు వస్తారని అంచనా వేయడంలో టీటీడీ విఫలమైంది. ప్రణాళిక వైఫల్యంతో చివరకు టోకెన్లు లేకుండానే భక్తులను కొండపైకి అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

-అనాలోచిత నిర్ణయాలు..
టీటీడీ తీసుకునే నిర్ణయాలు భక్తులకు సౌకర్యంగా ఉండాలి కానీ.. ఇబ్బందికరంగా మార కూడదు. భక్తులకు దర్శనం సాఫీగా జరిగే ఏర్పాట్లు ఉండాలి కానీ నియంత్రించేలా నిర్ణయాలు ఉండ కూడదు. వచ్చిన భక్తులు వచ్చినట్లు స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోయేలా ఏర్పాట్లు ఉంటే ఎంత మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో ఎన్నోసార్లు రద్దీ పెరిగింది.. టీటీడీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని రద్దీని తగ్గించింది. ప్రస్తుతం పాలకవర్గం రద్దీ నియంత్రణలో విఫలమైంది. టోకెన్ల సంఖ్య పెంచినప్పుడు అందుకు అనుగుణంగా కొండపైకి బస్సులు కూడా పెంచాలి. ప్రస్తుతం అధికారులు ఆ విషయాన్ని విస్మరించారు. దీంతో భక్తులు కొండపైకి రావడానికి కూడా అవస్థలు పడడం టీటీడీ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని చెప్పొచ్చు.

కలియుగ వైకుంఠంగా పేరున్న తిరుమలలో ఈస్థాయిలో పాలనా పరమైన వైఫల్యాలు ఎవరికీ మంచిది కాదు. తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం జరిగేలా ఇప్పటికైనా టీటీడీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular