TSRTC: మగవారే మన సంస్థకు నిధి.. టీఎస్ ఆర్టీసీ పై పేలుతున్న మీమ్స్

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులే మన సంస్థకు నిధి.. వారిని కాపాడుకోవడం మన విధి. ఆడవాళ్లకు సీటు ఇచ్చి గౌరవించడం మన సంస్కారం అనే తీరుగా నినాదాలు రాసి ఉండేవి. కానీ ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కావడంతో ఆ నినాదాలను మార్చుకోవాలని పురుష ప్రయాణికులు సూచిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 9, 2023 10:04 am

TSRTC

Follow us on

TSRTC: ఆరు గ్యారెంటీలలో భాగంగా మొదటి గ్యారెంటీ అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం శ్రీకారం చుట్టింది.. మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో తెలంగాణ మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసలు బాటు లభించింది. ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే చాలు ఆర్టీసీలో వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిర్ణయం పై మహిళల నుంచి హర్షం వ్యక్తం అవుతుండగా.. పురుషుల నుంచి మాత్రం భిన్నమైన స్వరం వినిపిస్తోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై రకరకాల కామెంట్లు, నవ్వు తెప్పించే మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. శనివారం ఈ పథకం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.

నవ్వు తెప్పిస్తున్నాయి

ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులే మన సంస్థకు నిధి.. వారిని కాపాడుకోవడం మన విధి. ఆడవాళ్లకు సీటు ఇచ్చి గౌరవించడం మన సంస్కారం అనే తీరుగా నినాదాలు రాసి ఉండేవి. కానీ ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కావడంతో ఆ నినాదాలను మార్చుకోవాలని పురుష ప్రయాణికులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ను ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇవి చదవడానికి నవ్వు తెప్పిస్తున్నాయి. ఇంకా మరికొందరైతే పేరుపొందిన సినిమాల్లో దృశ్యాలతో మీమ్స్ సృష్టిస్తున్నారు.. మహాలక్ష్మి పథకం ద్వారా మగవాళ్ళు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వ్యంగ్యంగా రాతలు రాస్తున్నారు. మరికొందరైతే కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితులను అన్వయించి.. రేపటి నాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే జరగబోతోంది అని వివరిస్తున్నారు. మగవాడికి వచ్చిన ఇబ్బంది మరెవరికీ రాకూడదని, చివరికి బస్సుల్లో మనకోసం సీట్లు కూడా ఉండని పరిస్థితి దాపురించిందని నెటిజెన్లు సరదాగా రాసుకొస్తున్నారు.

TSRTC

కర్ణాటక రాష్ట్రంలోనూ..

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఎన్నికలకు ముందు ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో.. మహిళలు గుంప గుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. అయితే ఈ పథకం తెలంగాణలో కూడా వర్క్ అవుట్ అవుతుందని భావించి ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలలో ప్రముఖంగా ఈ పథకాన్ని టిపిసిసి ప్రస్తావించింది. టీపీసీసీ భావించినట్టే మహిళలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. ఎన్నికలకు ముందు ఎలాగూ హామీ ఇచ్చింది కాబట్టి.. అధికారం చేపట్టిన రెండు రోజులలోనే మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చారు. వారం రోజులపాటు మహిళలు గుర్తింపు కార్డు చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తుంది. ఆ తర్వాత మహాలక్ష్మి కార్డు జారీ చేస్తుంది. ఆ కార్డు చూపిస్తే చాలు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఆ మహాలక్ష్మి కార్డు లో ఉన్న వివరాలను కండక్టర్లు తమ టిమ్ యంత్రాలలో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు రాయితీ చెల్లిస్తుంది.

TSRTC