Anant Ambani : అంబానీ ఇంట పెళ్లి మరీ.. ఆ ఏర్పాట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. ఎంత ఖర్చంటే?

మందస్తు పెళ్లి వేడుక నిర్వహించే ప్రాంతానికి సొంత డబ్బులతో రహదారులు, సెంట్రల్ లైటింగ్ నిర్మించినట్టు సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి భారీగా అధితులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు, కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి.

Written By: NARESH, Updated On : February 26, 2024 6:44 pm
Follow us on

Anant Ambani : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ ఉండదంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ. ప్రస్తుతం ముఖేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న ముందస్తు పెళ్లి వేడుకకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను చూస్తే “ఒక సంపన్నుడు తలుచుకుంటే మాత్రం కొండమీది కోతి నైనా తీసుకు రాగలడు” అనిపిస్తోంది.. భారతదేశంలోనే అతిపెద్ద సంపన్నుడు. లక్షల కోట్ల సామ్రాజ్యాలకు అధిపతి. వేలాదిమంది ఉద్యోగులకు భాస్. అలాంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గుజరాత్ లోని జామ్ నగర్ లో తన కుమారుడు అనంత్, కాబోయే కోడలు (ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈవో వీరన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ దంపతుల చిన్న కుమార్తె) రాధిక మర్చంట్ కు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి మూడు వరకు మూడు రోజులపాటు ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతాయి. జామ్ నగర్ ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్స్ లేకపోవడంతో ముఖేష్ అంబానీ “ఆల్ట్రా లగ్జరీ టెంట్లు ” ఏర్పాటు చేస్తున్నారు. అతిధుల కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో టైల్డ్ బాత్రూం నుంచి మొదలు పెడితే ఆధ్యాత్మిక సదుపాయాల వరకు ఉంటాయి. ఇందులో ఫైవ్ స్టార్ హోటల్ అనుభూతి లభిస్తుంది అని రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిధులు ఇందులో సేద తీరుతారని తెలుస్తోంది.

ఈ ముందస్తు వివాహ వేడుకకు సంబంధించి ముకేశ్ అంబానీ ప్రపంచంలోని అతిరథ మహారధులందరిని ఆహ్వానించారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శాంతను నారాయణ్, వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్, బ్లాక్ రాక్ సీఈవో లారీ పింక్ వంటి అంతర్జాతీయ వ్యాపారవేత్తలు ముందస్తు వివాహ వేడుకల్లో సందడి చేయనున్నారు.

ఇక దేశీయంగా గౌతమ్ ఆదాని, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, గోద్రెజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నిలేకని, ఆర్ పి ఎస్ జి గ్రూప్ హెడ్ సంజీవ్ గోయంకా, విప్రో రిషద్ ప్రేమ్ జీ, ఉదయ్ కోటక్, ఆధార్ పునావాలా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, రోష్నీ నాడార్, నిఖిల్ కామత్, రొన్ని స్క్రూ వాలా, దిలీప్ సింఘ్వీ వంటి వారిని కూడా ముఖేష్ అంబానీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇండియన్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా సోదరులు, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ తో సహా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ నటులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు హాజరయ్యే అతిధుల కోసం ముఖేష్ అంబానీ ఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. హాలీవుడ్ పాప్ గాయని రిహన్నా, దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు తమ ఆటపాటలతో అతిధులను అలరించనున్నారు.. ఈ మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుక కోసం ముఖేష్ అంబానీ వందల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. మందస్తు పెళ్లి వేడుక నిర్వహించే ప్రాంతానికి సొంత డబ్బులతో రహదారులు, సెంట్రల్ లైటింగ్ నిర్మించినట్టు సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి భారీగా అధితులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు, కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి.