Telangana BJP: దేశంలో ఒంటిచేత్తో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాని మోడీ.. ఆ ఒంటిచేత్తో జర్నలిస్టులను ఎదుర్కోవడం మాత్రం ఇప్పటికీ సవాలే. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మోడీ సైలెంట్ గా ఉండగా.. నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విలేకరులు అడిగిన క్లిష్ట ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. మీడియాను ఫేస్ చేసేందుకు మోడీ ఇప్పటికీ భయపడుతుంటాడు.అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉండగా ఓ దిగ్గజ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నలు మోడీని భయపెట్టాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మోడీ వీడియో సందేశాలు, సభలు, సమావేశాల్లో తప్ప ఒంటరిగా మీడియాను ఎదుర్కొని వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన దాఖలాలు లేవు.

విలేఖరులకు ఇంటర్వ్యూ ఇవ్వడం పక్కన పెడితే ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా అరుదు. గత ఎనిమిదేళ్లలో కాషాయ దళానికి సన్నిహితంగా ఉండే హై ప్రొఫైల్ మీడియా వ్యక్తులకు మోడీ రెండు ఇంటర్వ్యూలు ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మోడీ ముఖాముఖిగా జర్నలిస్టులతో సంభాషించే అవకాశం లభించడం ఏ జర్నలిస్టుకైనా అరుదైన అవకాశం. ఇప్పటి వరకు ఒక్క తెలుగు జర్నలిస్టుకు కూడా అలాంటి అవకాశం రాలేదు. అయితే మంగళవారం పార్లమెంటులోని తన ఛాంబర్‌లో న్యూఢిల్లీలోని ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక సీనియర్ జర్నలిస్టు ఎ కృష్ణారావుతో మోదీ 20 నిమిషాల పాటు సంభాషించడం విశేషం.
ఈ సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై తాను కొత్తగా రాసిన “ది క్వింటెస్సెన్షియల్ రెబెల్” పుస్తకాన్ని కృష్ణారావు స్వయంగా మోదీకి అందించారు. వీరిద్దరి భేటిలో ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మోడీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న విజయావకాశాల గురించి.. బీజేపీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అని మోడీ స్వయంగా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావును అడిగి తెలుసుకున్నారట.. ప్రధానికి కృష్ణారావు ఏం చెప్పారో వెంటనే తెలియదు కానీ.. తెలంగాణలో గెలుపు కోసం మోడీ చాలా సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
మోడీ తెలంగాణలో గెలుపే ధ్యేయంగా అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రజ్యోతికి చెందిన సీనియర్ జర్నలిస్ట్‌తో ఈ కీలక భేటి నిర్వహించినట్టు తెలిసింది. ఇది ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గెలుపునకు సహాయపడుతుందని.. మోడీ తెలంగాణపై సీరియస్ గా ఉన్నాడని అర్థమవుతోంది.
ఇక భారత్ కు పీవీ నరసింహారావు చేసిన సేవలను కాంగ్రెస్ గుర్తించకపోవడంపై మోదీ విచారం వ్యక్తం చేశారు. “ఒక కుటుంబాన్ని మాత్రమే కీర్తించడమే కాంగ్రెస్‌కు నమ్మకం. ఇది ఇతర బలమైన నాయకులను గుర్తించదు” అని మోడీ అన్నారు. “నరసింహారావు ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో గొప్ప కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆయనదే ప్రధాన పాత్ర. అయినప్పటికీ పార్టీ నాయకత్వం దేశానికి ఆయన చేసిన సేవలను తక్కువ చేసి చూపించాలని చూస్తోంది’ అని మోడీ విమర్శించారు.
తీన్‌మూర్తి భవన్‌లోని నెహ్రూ మెమోరియల్ లైబ్రరీలో ప్రధాన మంత్రి సంగ్రహాలయాన్ని నిర్మించడం ద్వారా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరి సేవలను తాను గుర్తించానని మోడీ గుర్తు చేశారు. ప్రతి ప్రధానమంత్రి సాధించిన విజయాలను సంగ్రహాలయంలో పొందుపరిచామని మోడీ తెలిపారు. కాంగ్రెస్ ప్రధానులను బీజేపీ గుర్తించిందని పేర్కొన్నారు.
ఇలా మోడీ తెలంగాణపై.. ఇక్కడి నేతలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఏ విషయాన్ని వదులుకోకూడదని.. ఖచ్చితంగా గెలుపు కోసం తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టులు, మేధావుల సాయం తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రజల మనోభావాలను తెలుసుకొని ఎలా ముందుకెళితే విజయం సాధిస్తామో మోడీ ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే ధ్యేయంగా మోడీ రాజకీయం నరుపుతున్నట్టు తెలిసింది.