Prashant Kishore : ఏపీలో ఎంటరైన ప్రశాంత్ కిశోర్.. వారందరిపై నివేదిక

హెలిప్యాడ్, బహిరంగ సభ వేదికల వద్ద ఆయన పార్టీ నేతలతో, ద్వితీయ శ్రేణి నాయకులతో సంభాషిస్తూ పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో  ప్రశాంత్ కిశోర్ తో భేటీ చాలా అంచనాలనే పెంచుతోంది. 

  • Written By: Dharma Raj
  • Published On:
Prashant Kishore : ఏపీలో ఎంటరైన ప్రశాంత్ కిశోర్.. వారందరిపై నివేదిక

Prashanth Kishore : ఏపీలో ప్రశాంత్ కిశోర్ అడుగుపెట్టనున్నారా? కీలక సమాచారంతోనే వస్తున్నారా? నివేదికను అధినేత జగన్ చేతిలో పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నీ కుదిరితే ఈ రోజే జగన్ తో పీకే కీలక భేటీ అవుతారని సమాచారం. ప్రస్తుతం వైసీపీకి తాను వ్యూహకర్త కాకున్నా.. తన ఐ ప్యాక్ టీమ్ పనిచేస్తోంది. బిహార్ రాజకీయాలపై మమకారంతో అటువైపు వెళ్లిన పీకే.. తనకు ఇంతటి పేరు తెచ్చిపెట్టిన స్ట్రాటజిస్టు కొలువును మాత్రం వదులుకోలేదు. తెలంగాణలో కేసీఆర్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఇక్కడ ఏపీలో సైతం జగన్ కు సేవలందిస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఇరు పార్టీలను గట్టెక్కించే గురుతర బాధ్యతను పీకే తీసుకున్నారు.

అయితే ఏపీలో వైసీపీ సర్కారు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. కానీ సంక్షేమ పథకాలతో గట్టెక్కుతామని ఆశాభావంతో ఉంది. ఈ తరుణంలో ఐ ప్యాక్ టీమ్ లు ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నాయి. ప్రతీ నియోజకవర్గాన్ని జల్లెడ పడుతున్నాయి. నివేదికలను తయారుచేశాయి. అయితే వాటి తుది రూపం పీకే చేతికి చేరినట్టు తెలుస్తోంది. ఆ నివేదికతోనే జగన్ తో పీకే భేటీ అవుతున్నట్టు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం జగన్‌ మోహన్‌ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నందున ఈ సమావేశం చాలా కీలకమైనదని చెబుతున్నారు.రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి పై ప్రశాంత్‌ కిషోర్‌ సవివరమైన నివేదికను ఈ సమావేశంలో జగన్‌ కు అందిస్తారని తెలుస్తోంది.

వేర్వేరు రీతుల్లో సర్వేలు నడిచినట్టు సమాచారం. గెలిచే ఎమ్మెల్యేలు, ఓడిపోయే ఎమ్మెల్యేలు, మార్చాల్సిన అభ్యర్థులు, సులువుగా గెలిచే నియోజకవర్గాలు, ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ ఉండే స్థానాలు, కొంచెం కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు గెలవడానికి ఏమాత్రం అవకాశం లేని నియోజకవర్గాలు ఇలా అన్నింటిపై కులంకుశంగా చర్చిస్తారని సమాచారం. దీంతో పాటు ప్రత్యర్థి పార్టీల పరిస్థితి, పవన్‌ కల్యాణ్‌ ప్రభావం ఇలా తదితర అంశాలపై ప్రశాంత్‌ కిశోర్‌ సవివరమైన నివేదికను జగన్‌ కు అందిస్తారని టాక్‌ నడుస్తోంది.ఇప్పటికే అట్టడుగు స్థాయి నుంచి మొదలుకొని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలపై ఐప్యాక్ బృందం దృష్టి సారించింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ఐప్యాక్‌ సభ్యులు నిశితంగా అనుసరించారు.పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇంటింటికి వెళ్లినప్పుడు, మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమాల్లోనూ ఐప్యాక్‌ బృందం పాల్గొంది. అక్కడ గుర్తించిన అంశాలనే నివేదిక రూపంలో పొందుపరచింది.

గత ఎన్నికల్లో వైసీపీకి బలమైన ఆయుధం మేనిఫెస్టో. నవరత్నాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అందులో కొన్నింటిని అమలుచేస్తున్నారు కూడా. ఇప్పడు వచ్చే ఎన్నికల కోసం అంతకు మించి మేనిఫెస్టో రూపొందించేందుకు పీకేతో జగన్ సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విపక్షాలపై విమర్శలు డోసు కూడా పెంచారు. క్లాస్ వార్ వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు అందులో భాగంగానే. ఇటీవలి కాలంలో వివిధ పథకాల కోసం బహిరంగ సభలకు హాజరవుతున్న ఆయన ఇప్పటికే తన వ్యూహాన్ని మార్చుకున్నారు.హెలిప్యాడ్, బహిరంగ సభ వేదికల వద్ద ఆయన పార్టీ నేతలతో, ద్వితీయ శ్రేణి నాయకులతో సంభాషిస్తూ పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో  ప్రశాంత్ కిశోర్ తో భేటీ చాలా అంచనాలనే పెంచుతోంది.

సంబంధిత వార్తలు