Prabhas speech at Sitaram prerelease event ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు అస్సలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఎలాగూ విడుదలైన నెల తర్వాత సినిమా ఓటీటీల్లో వస్తుందని ఇంట్లోనే మిన్నకుండిపోతున్నారు. దీనివల్ల సినిమా పరిశ్రమ కుదేలవుతోంది. ఇక సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచడం కూడా ప్రేక్షకుడు థియేటర్ కు రాకపోవడానికి ప్రధాన కారణం. దీనివల్ల సినీ పరిశ్రమకు గట్టి దెబ్బలే తగులుతున్నాయి.
ఈ నొప్పి తెలిసింది కావచ్చు.. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ‘సీతారామం’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటీటీని ఇంట్లో పూజగదితో పోల్చి థియేటర్ ను ‘గుడి’గా మలిచాడు. ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? మాకు థియేటర్ యే గుడి అంటూ ఎమోషనల్ డైలాగులు పేల్చారు.
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరు అగ్రహీరోల సినిమాలు కాస్తా అటు ఇటుగా ఉన్నా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు హిట్ చేయడం లేదు. అందుకే ఈ సెగ ప్రభాస్ సహా సినీ హీరోలందరికీ తగులుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలంతా ఒక్క హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
కరోనా తర్వాత ప్రేక్షకుడి అభిరుచి మారడం.. జనాలు ఓటీటీకి అలవాటు పడడం.. మంచి కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడడంతో సినిమాలు బాగుంటే తప్ప ప్రేక్షకుడు థియేటర్ కు రావడం లేదు. అందుకే ప్రభాస్ ఇలా ప్రేక్షకుడి దృష్టి కోణంలోనే సినిమా ఇండస్ట్రీ పరిస్థితిని కళ్లకు కట్టారు. థియేటర్ యే గుడి అని.. ప్రేక్షకులంతా రావాలని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది.
ఇక సీతారామం సహా తన ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాన్ని ముందుండి నడిపిస్తున్న నిర్మాత స్వప్న దత్ తనను టార్చర్ చేసి ఈ ప్రీరిలీజ్ కు రప్పించిందని.. ఆమె కోసమే తాను వచ్చానని.. ఆమె మాత్రం తెరవెనుక ఉందని ప్రభాస్ వేదికపై మారాం చేశాడు. స్వప్న వస్తేనే తాను మాట్లాడుతానని కాసేపు సరదా చేశాడు. చివరకు స్వప్న దత్ వచ్చి ప్రభాస్ తన కోరిక మేరకు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. అసలు బయటకు రాని ప్రభాస్ తను పిలవగానే వచ్చాడని తెలిపింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా.. మృణాల్ హీరోయిన్ గా నటించిన మూవీ ‘సీతారామం’ ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం సహా ప్యాన్ ఇండియా లెవల్ లో సినిమా విడుదలవుతోంది. ఈ మూవీని అశ్వినీదత్, స్వప్న దత్ లు నిర్మించారు. సినిమా ప్రీరిలీజ్ కు హాజరైన ప్రభాస్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ కు కాలు కు ఆపరేషన్ అని.. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చాలా గాసిప్పులు వచ్చాయి.కానీ ఈ ప్రీరిలీజ్ కు వచ్చిన ప్రభాస్ అంతే హ్యాండ్సమ్ గా కనిపించడంతో ఆయనకు ఏం కాలేదని అందరికీ అర్థమైంది.