Happy Birthday Prabhas: ప్రభాస్ మంచి తనమే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలందుకునేలా చేసింది. ప్రభాస్ వ్యక్తిత్వమే అతన్ని పాన్ ఇండియా స్టార్ ను చేసింది.. ఇది ప్రభాస్ గురించి ఓ సందర్భంలో రాజమౌళి చెప్పిన మాట. ఈ మాటే నిజం. అయితే, లవర్ బాయ్ గా, మాస్ హీరోగా తనకంటూ వందకోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ పుట్టినరోజు నేడు.
తెలుగులో ఎందరు గొప్ప స్టార్లు ఉన్నా.. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఘనత అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి, ఇప్పట్లో ప్రభాస్ కే దక్కింది. 150 కోట్ల తెలుగు సినిమా మార్కెట్ ను రూ.2 వేల కోట్లకు చేర్చడం ప్రభాస్ కే సాధ్యం అయింది. బాలీవుడ్ స్టార్ హీరోలను మన స్టార్ హీరోలు కూడా.. వాళ్ళు అతీతమైన స్టార్లుగా భావించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ లో సగం బడ్జెట్ కూడా మన స్టార్ హీరోలకు ఉండదు.
అందుకే బాలీవుడ్ హీరోలకు ముందు నుంచి ప్రత్యేక క్రేజ్ ఉంది. కానీ ప్రస్తుతం ఏ బాలీవుడ్ స్టార్ హీరోకు లేనంత బడ్జెట్‌తో ప్రభాస్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. పైగా ఒకేసారి నాలుగైదు భారీ ప్రాజెక్టులు షూట్ లో ఉన్నాయి. ఆ నాలుగు సినిమాల బడ్జెట్ మొత్తం కలిపి రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుంది. అదీ ప్రభాస్ స్టార్ డమ్.
మరి ఈ నిజమైన పాన్ ఇండియా స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. ముందుగా ప్రభాస్ భోజన ప్రియుడు. అన్నిటికి మించి ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ సినిమా షూట్ లో అందరూ ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే క్యారేజీలు కోసమే ఎదురుచూస్తుంటారు. అంత గొప్ప టేస్ట్ ఉంది ప్రభాస్ ఫుడ్ పై.
ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒకవేళ తాను హీరో కాకుంటే.. మంచి హోటల్ లేదా రెస్టారెంట్ బిజినెస్ చేసేవాడిని అని ప్రభాస్ చెప్పాడు. ఇక ప్రభాస్ నటన విషయానికి… అసలు చిన్నప్పటి నుంచి నటుడవ్వాలనే కోరిక ప్రభాస్ కి లేదు. వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాడు. కృష్ణంరాజు ‘భక్తకన్నప్ప’ చూసిన తర్వాతే తాను హీరో అవ్వాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడట.
అలా ‘ఈశ్వర్’ అంటూ మొదటి సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ప్రభాస్ అనే ఒక హీరో ఉన్నాడు అని తెలిసింది. ఇక ఆ తర్వాత చేసిన ‘రాఘవేంద్ర’ కూడా బాక్సాఫీసు వద్ద భారీ ప్లాప్ అయింది. అప్పుడే ‘వర్షం’తో ప్రేక్షకులను పలకరించాడు. సూపర్ హిట్ టాక్ వచ్చింది. ‘వర్షం’ కలెక్షన్లు చూసి ప్రభాస్ లో ఆశ చిగురించింది.
కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత ‘ఛత్రపతి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ అయ్యాడు. మధ్యలో పరాజయాలే పలకరించిన తనలోని కొత్తదనాన్ని వెలికి తీస్తూ హీరోగా తనకు తానే మార్చుకుంటూ ‘బుజ్జిగాడు’తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ‘బిల్లా’తో స్టైలిష్ హీరో అనిపించుకున్నాడు. ఇక ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘మిర్చి’ లాంటి వరుస హిట్స్ కొట్టాడు.
అయితే ‘బాహుబలి’తో మాత్రం దేశవ్యాప్తంగా తెలుగోడి సత్తా చూపించి ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు చేస్తోన్న ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘స్పిరిట్’లు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ ఇలాగే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకోవాలని కోరుకుంటూ మా ఓకే తెలుగు తరుపున ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.