Ponguleti Srinivas Reddy- Jagan: జగన్ మాటా వినాలా? జనం మాటా వినాలా?: డైలామాలో పొంగులేటి
పొంగులేటి, జగన్ మధ్య ఎప్పటి నుంచో సంబంధం ఉంది. షర్మిల, విజయలక్ష్మితో కూడా అదే స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా జగన్ పెట్టిన వైఎస్‌ఆర్‌సీపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని చేశాడు.

Ponguleti Srinivas Reddy- Jagan: అనుచరులు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నా పెద్దగా ఫాయిదా దక్కడం లేదు. పార్టీ పెడతామని ప్రచారం చేస్తున్నా అంతగా జనంలోకి రీచ్ కావడం లేదు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వను అని సవాల్ కూడా విసిరాడు. ఇలాంటి పరిస్థితిల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. పోనీ తన రాజకీయ గురువు జగన్‌మోహన్‌రెడ్డి సలహా తీసుకుందామంటే ఆయన బీజేపీలో చేరు అని సలహా ఇస్తున్నాడు. ఖమ్మం జిల్లా ప్రజలేమో కాంగ్రెస్‌లో చేరాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక పొంగులేటి డైలామాలో కూరుకుపోయాడు.
ఎప్పటినుంచో సంబంధం ఉంది
పొంగులేటి, జగన్ మధ్య ఎప్పటి నుంచో సంబంధం ఉంది. షర్మిల, విజయలక్ష్మితో కూడా అదే స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా జగన్ పెట్టిన వైఎస్‌ఆర్‌సీపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని చేశాడు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌లోకి పంపించాడు. కానీ అందులో అంతగా ప్రాధాన్యం దక్కకపో వడం, సీటు కూడా లభించకపోవడంతో పొంగులేటి బయటకు వచ్చారు. ఈ నిర్ణయం వెనుక కూడా జగనే ఉన్నారని పొంగులేటి సన్నిహితులు అంటూ ఉంటారు. ఈక్రమంలో రెండు మూడు సార్లు జగన్‌ను పొంగులేటి కలిశారు. అయితే రాజకీయ ప్రయాణం గురించి చర్చకు వచ్చినప్పుడు బీజేపీలోకి వెళ్లాలనే సలహా వచ్చింది. అయితే దీనిపై పొంగులేటి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రజలు కూడా కాంగ్రెస్ పాటే
ఇక పొంగులేటి నిర్వహిస్తున్న వరుస ఆత్మీయ సమ్మేళనాలలో కూడా ప్రజలు కాంగ్రెస్‌లో చేరాలని పొంగులేటి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరితో కచ్చితంగా పది సీట్లు గెలుస్తామని వారు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఏం జరిగిందో లెక్కలతో సహా వివరిస్తున్నారు. అయితే వారి మనోభిష్టానికి మొగ్గితే తనకు రాజకీయ అండ లేకుండా పోతుందని పొంగులేటి భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ నేతలతో ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడకు అంతర్గత ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో అది తన రాజకీయ ప్రయాణానికి ఆటంకం అని పొంగులేటి ఒక అంచనాకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరో వైపు పొంగులేటి ప్రధాన అనుచరుల్లో ఒకరయిన మట్టా దయానంద్ విజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో పొంగులేటి బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.
బిజెపి కూడా ఆహ్వానిస్తోంది
ఇక పొంగులేటిని బీజేపీలోకి ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆహ్వానిస్తున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కీలక నాయకుడు జూపల్లి కృష్ణారావును కూడా రమ్మని కబురు పంపుతున్నారు. ఇటీవల ఖమ్మంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌రావుతో కలిసి పొంగులేటిని కలిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే దీనిపై వారిద్దరూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా జూపల్లిని డీకే అరుణ కూడా పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే విరిద్దరూ బీజేపీలో చేరేందుకు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. అయితే పొంగులేటి ప్రధాన అనుచరుడు దయానంద్ విజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో… పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన ఆనుచరులు అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశ్యం ఉంటే దయానంద్ పొంగులేటి వెంట ఉండేవారని, ఆయన అంతరంగం వేరే ఉంది కనుకే దయానంద్ హస్తం గూటికి చేరారని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.